యువత మత్తుకు బానిస కావొద్దు..ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు..! - ఉపకార్ కప్ విజేత వాల్తేరు లెవెన్ కి ట్రోఫీ ప్రధానోత్సవంలో సీపీ శంఖబ్రత భాగ్చి


Ens Balu
16
visakhapatnam
2024-11-03 12:55:34

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు  పెద్ద కుమారుడు స్వర్గీయ యశ్వంత్ బాబు 27వ జయంతిని  ఆదివారం ఉదయం ఆరిలోవ పినాకిల్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత కంచర్ల అచ్యుత రావు, హీరో ఉపేంద్ర బాబు, కుటుంబ సభ్యులు సుబ్బ లక్ష్మి, సునీత, కిరీటి, పార్ధు యశ్వంత్ బాబు చిత్ర పటానికి పూల మాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  ఉపకార్ కప్ సీజన్ 2 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ క్రాంతి లెవెన్, వాల్తేరు లెవన్ జట్లు మద్య నిర్వహించి ఆపై బహుమతి ప్రధానోత్సం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత భాగ్చి విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సిపి మాట్లాడుతూ, డా.కంచర్ల అచ్యుత రావు సేవల కోసం విన్నాను.. ఇపుడు స్వయంగా చూస్తున్నానని అన్నారు. 

 ఒక పోలీసు కుటుంబానికి కూడా ఆయన అండగా నిలిచారని.. కొవిడ్ సమయంలో కూడా  ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. యువత దేశానికి భవిత అన్నారు. క్రీడాకారులు దేశానికి మంచి పేరు తేవాలన్నారు. నేటి యువత గంజాయి, మద్య పానం కి బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఏ సమస్యా వచ్చినా తనకు 7995095799 నంబర్ లో సంప్రదించాలని కోరారు. మార్పు కార్యక్రమం కింద డి ఎడిక్షన్ ద్వారా మత్తు నుంచి విముక్తి కల్పిస్తున్నామన్నారు. యువకులు గంజాయి సేవనం ద్వారా మెదడు దెబ్బ తిని విచక్షణ కోల్పోయి మానసిక రోగులుగా తయారవుతారన్నారు. తద్వారా  తల్లి దండ్రులకి మానసిక క్షోభమిగులుతుందన్నారు. యువతలో ప్రేమ సహజమే కానీ, ప్రేమ విఫలమయ్యి ఆత్మహత్యే శరణ్యం అనుకోవడం సరికాదు అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టు ఆత్మ విశ్వాసం పెంచుకోవాలని సూచించారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని చైతన్య పరిచారు.

 తనకు కూడా అడ్వంచర్ స్పోర్ట్స్ అంటే ఎంతో ఇష్టమని.. పర్వతారోహణ హాబి అని గుర్తు చేశారు. క్రీడలతో ఆరోగ్యం పెరుగుతుందన్నారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన కంచర్ల అచ్యుత రావు ను సీపీ ప్రత్యేకంగా అభినందించడంతోపాటు.. రానున్న కార్యక్రమాలకు పోలీసు శాఖ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. జాతీయ క్రికెట్ జట్టుకు విశాఖ నుంచి, ఆరిలోవ నుంచి క్రీడాకారులు ఎంపిక అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.  సినీనిర్మాత డా.కంచర్ల అచ్యుత రావు మాట్లాడుతూ, నగర పోలీసు కమిషనర్ శంఖ బ్రత బాగ్చి వచ్చిన తర్వాత నగరంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని కొనియాడారు. యువత అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విధానం నమ్మిన ఏకైన పోలీసు అధికారి విశాఖ సీపీ మాత్రమేనన్నారు.  ఐపిఎల్ తరహాలో ఫ్రాంచైజీ ద్వారా క్రికెట్ జట్లను కొనుగోలు చేసి క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించామన్నారు. గత ఏడాది 12, ఈ ఏడాది 24 జట్లు పాల్గొన్నాయని గుర్తు చేశారు. ఈ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారం చేశామన్నారు. దీంతో ఇతర క్రీడాకారులకు ప్రోత్సాహం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.

క్రీడల వలన యువతకు మానసిక ఆరోగ్యం పెరుగుతుందన్నారు.  బాక్సింగ్, వాలీబాల్, ఫుట్ బాల్ టోర్నమెంట్లు,  త్వరలో రెండో సారి టార్గెట్ బాల్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  యశ్వంత్ బాబు 27 వ జయంతి వేడుకలలో భాగంగా బహుమతి ప్రదానోత్సవం నిర్వహించామని గుర్తుచేశారు. ప్రముఖ సినీ హీరో కంచర్ల ఉపేంద్ర బాబు మాట్లాడుతూ, క్రికెట్ టోర్నమెంట్ దిగ్విజయంగా జరగడం అన్నయ్య కూడా పైలోకం నుంచి శంతోషపడతారన్నారు. తన తండ్రి, సీపీ భావాలు కలవడం వల్లనే ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించామన్నారు. క్రీడాకారులకి ఇటువంటి టోర్నమెంట్లు ప్రోత్సాహం ఇస్తాయన్నారు. ఇరు జట్ల క్రీడాకారులను ఈస్ట్ ఏసిపి లక్ష్మణ మూర్తి పరిచయం చేసు కున్నారు. 

 కాగా క్రాంతి లెవెన్ జట్టు మొదట్ బ్యాటింగ్ చేసి 62 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన వాల్తేరు లెవెన్ జట్టు వికెట్లు ఏమి నష్టపోకుండా 63 పరుగులు చేసి విజేతగా నిలిచింది. విజేతలకు నగదు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంతో పాటు కిరణ్మయి నృత్య అకాడమీ విద్యార్థులచే వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంచర్ల అచ్యుతరావు సమక్షంలో  ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీపీ విజేతలకు, టీం సభ్యులకు బహుమతులు అందజేశారు. విజేత జట్టు వాల్తేరు జట్టుకు రూ.1.20 లక్షలు ప్రైజ్ మనీ, ట్రోఫీ అందజేశారు. రన్నర్ జట్టు క్రాంతి లెవెన్ జట్టుకు రు.60 వేలు, తృతీయ బహుమతి గెలుచుకున్న కాశిం లెవెన్ జట్టుకు రూ. 30 వేలు అందజేశారు. డ్రీమ్ జట్టు ఆటగాడు నాగ రాజు, పవన్ బెస్ట్ బ్యాట్స్మన్,  బెస్ట్ బౌలర్ రమేష్,  బెస్ట్  ఫీల్దర్ గోపి , ఇంకా సాయి అవార్డులు అందుకున్నారు. విశాఖ సౌండ్స్ అండ్ లైట్స్ టీమ్ కి ద్వితీయ బహుమతి కింద రూ.10వేలు, డూ ఆర్ డై జట్టు కి ప్రథమ బహుమతి కింద రూ.20 వేలు అందజేశారు. 

 ఈ నెల 25 వ తేదీన జరగనున్న వైజాగ్ స్టీట్ ప్రీమియర్ లీగ్ లోగో ను సీపీ ఆవిష్కరించారు. ప్రైజ్ మనీ కింద రూ.5లక్షలు వుంటుందని, పోటీలు అక్కయ్యపాలెం పోర్టు స్టేడియం లో జరుగుతుంది అని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే, ఏపీ వాలి బాల్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది అన్నారు. అతిథులు, టోర్నమెంట్ కి సహకరించిన వారిని శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ కుమార్, సభ్యులు అరుణ, అనిత, పద్మ, ఎస్ ఎస్ ఎల్ వి క్రియేషన్స్ మేనేజర్ నాగ,  తదితరులు పాల్గొన్నారు.