ఏపీటీడీసీలో అడ్డగోలు నియామకాలు..?!


Ens Balu
43
visakhapatnam
2024-11-19 19:36:57

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంలోని పరిపాలనా పరమైన అంశాలు కొన్ని ఏపీ టూరిజం డెవలెప్ మెంట్ కార్పోరేషన్ అధికారులకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి.. మనల్ని ఎవరు అడుగుతారని.. ఇష్టాను సారం చేసిన వ్యవహారాలు ఇపుడు కప్పిపుచ్చుకోవడానికి అన్ని అడ్డదా రులూ వెతుకుతున్నట్టు కనిపిస్తున్నది..విశాఖలో ఏపీటీడీసికి చెందిన హరిత యాత్రీ నివాస్ విషయంలో ఇప్పటికి సుమారు రూ.8కోట్లు కేవలం మరమ్మతులు, గదుల్లోని సామాగ్రి కొనడానికి ఖర్చు చేసేశారు. అయితే దేనికి ఎంత ఖర్చు అయ్యిందో లెక్కలు మాత్రం ఇటు జిల్లా కలెక్టర్ గానీ.. అటు రాష్ట్రప్రభుత్వానికి గానీ చెప్పలేదు. పైగా మరో రూ.5 కోట్లు కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ విషయా న్ని ఈరోజు-ఈఎన్ఎస్ వెలుగులోకి తీసుకు వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్ర ఏపీటీడీసీ అధికారులు మరింతగా అడ్డదారులు వెతుకు తున్నా రు. ఏకంగా ఎండీకే తెలియకుండా నేరుగా ఈడి విశాఖలో జిల్లా మేనేజర్ పోస్టుని ఆఘమేఘాలపై డిప్యూటేషన్ పై నియమిం చేశారు.

ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే.. ప్రస్తుతం విశాఖజిల్లా వ్యాప్తంగా ఏపీటీడీసి హోటల్ల మరమ్మతులకు సంబంధించి ఒకే కాంట్రాక్టర్ కి రూ.40 కోట్లు టెండర్లు ఇచ్చేశారు. అన్ని పనులూ ఒక్కరికే ఇవ్వడంతో ఆ కాంట్రాక్టర్ కాస్త నచ్చినట్టు చేసుకుంటూ.. అధికారు లకు కమిషన్లు ఇస్తూ లేని లెక్కలు ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. ఇపుడా లెక్కలు బయటకు తీసే పరిస్థితి వచ్చింది. దీనితో సొంత శాఖ అధికారులైతే వాస్తవాలు వెలుగు చూస్తాయని పొరుగుజిల్లా, ఇతర శాఖల నుంచి అధికారులను ఇక్కడికి డిప్యూటేషన్ పై నియమి స్తున్నారు..  ఏపీటీడీసీలో ఈ మొత్తం వ్యవహారాన్ని హరికథలు పార్ట్-5 ఈరోజు-ఈఎన్ఎస్ అందిస్తున్నది..!

కూటమి ప్రభుత్వంలో అక్రమాలకు తావుండదంటారు.. అదేంటో విశాఖలోని ఏపీటీడీసి హోటళ్ల మరమ్మతుల విషయంలో కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నా.. జిల్లాలో కలెక్టర్ తో సహా.. రాష్ట్ర అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదు. వాస్తవాలను మీడియా ప్రభుత్వం ముందుకి తీసుకెళ్లినా.. మరింతగా రెచ్చిపోతున్న ఏపీటీడీసి రాష్ట్ర అధికారులు వారి బినామీల ద్వారా చేపడుతున్న అడ్డగోలు వ్యవహారాన్ని అంతే తేడాగా కప్పిపుచ్చుకునేందు అన్ని దారులూ వెతుకుతున్నారు. కార్పోరేషన్ రాష్ట్ర అధికారుల చర్య వలన ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్నా.. ఇక్కడ పనిచేసే అధికారులను గానీ, కాంట్రాక్టర్ ని గానీ పల్లెత్తు మాట అనడం లేదంటే అసలు ఏం జరుగుతుందో మీరే అర్ధం చేసుకోవాలి. ఎక్కడైనా కొత్తవి కట్టకుండా మరమ్మతులు చేసుకుంటే కొత్తగా కనిపిస్తాయని  మొత్తం ఖర్చులో కొంత భాగాన్ని ఖర్చుచేస్తారు. విచిత్రంగా ఏకంగా ఒక స్టార్ హోటల్ కట్టేంత సొమ్ముతో కేవలం మరమ్మతులు మాత్రమే చేసి.. వాటికి ఇంకా డబ్బులు చాల లేదని ప్రభుత్వానికి మరో రూ.5 కోట్లు టెండరు వేసేద్దామని అధికారులు ప్లాన్ చేసినా ప్రభుత్వం పల్లెత్తు మాట అనడం లేదు.

విశాఖలోని ఏపీటీడీసికి చెందిన హరిత యాత్రీ నివాస్ లో అత్యధిక మొత్తం వెచ్చించి మరమ్మతులు చేస్తున్నారు. ఆ విషయంలో చాలా డబ్బు చేతులు మారుతోంది. డబ్బుకి తగ్గ మరమ్మతులు, వస్తువులు ఇక్కడ కనిపించడం లేదు. వాస్తవానికి ఇలా జరిగితే జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగాలి.. కానీ అలా జరగలేదు. పైగా ఇదేశాఖకు చెందిన అధికారులను ఇక్కడ నియమిస్తే.. ఎక్కడ వాస్తవాలు బయటకి వచ్చేస్తాయోనని లుక లుకలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారులు ఒక అవినీతి అధికారి శ్రీనివాసరావు అనే వ్యక్తిని ఆర్డీగా నియమించారు. ఆయనే జిల్లా మేనేజర్ పోస్టుకూడా అప్పగించారు. దీనితో రెండేళ్లు ఈయన ఆడిందే ఆట.. పాడిందే పాట. ఆ విషయం కాస్త మీడియాలో గుప్పు మనడంతో.. ఆయనను తప్పించి.. అసలు టూరిజంశాఖకు సంబంధం లేని వ్యక్తిని ఇరిగేషన్ లో ఇఇ గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి మళ్లీ ఆర్డీ స్థానంలో కూర్చో బెట్టారు. 

తరువాత కూడా మీడియా కథనాలు వరుసగా వస్తుండటంతో తనకు రెండు ఉద్యోగాలు భారంగా ఉన్నాయని చెప్పడంతో రాష్ట్ర అధికారులు మళ్లీ శ్రీకాకుళం జిల్లా నుంచి మరో అధికారి జిల్లా మేనేజరుగా నియమించారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే.. ఇదే శాఖలో ఉన్న అధికారులకి ఇన్చార్జిగా నియమిస్తే ఇక్కడ జరుగుతున్న తేడా పనులన్నీ ఆధారాలతో సహాయ బయటకు వచ్చేస్తాయ్ అలా రాకుండా ఉండేందుకు.. ఏకంగా టూరిజం కార్పోరేషన్ ఎండీ అనుమతి లేకుండా..సదరు రిఫరెన్స్ కూడా లేకుండా ఈడీ పద్మావతి నేరుగా ఇతర శాఖల్లోని అధికారులకు డిప్యూటేషన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఇపుడు ఆ ఆర్డర్ పైనే చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం ఏటీడీసీ ఎండీ ఆమ్రపాలి సెలవులో ఉన్నారు. దానిని రాచమార్గంగా తీసుకొని అక్కడి ఈడి నచ్చినవారికి విశాఖలో పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. 

అయితే వచ్చే అధికారులందరికీ ఒక లక్ష్మణ రేఖ గీసి మరీ ఏపీటీడీసీకి అధికారులుగా పంపిస్తున్నారట. అక్కడికి అధికారిగా వెళ్లినా.. మేము చెప్పినట్టే చేయాలి.. ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతుల పనులకు సంబంధించి ఏం మాట్లాడకూడదు.. లెక్కలు బయటకు తీయకూడదు.. నాణ్యతను పరిశీలించకూడదు.. బిల్లుల విషయంలో తలదూర్చకూడదు.. జిల్లా కలెక్టర్ కి దొంగచాటుగా నివేదికలు పంపకూడదు.. కాంట్రాక్టర్ పై ఒత్తిడి తేకూడదు.. కేవలం జిల్లా మేనేజర్  ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉండాలి అనే నిబంధనలతో పంపుతున్నారట. అలా అయినా విశాఖలో హరితర యాత్రీనివాస్ విషయంలో కాంట్రాక్టర్ అధికారులు కలిసి పెంచేసిన బిల్లు మొత్తాన్ని.. అక్కడ పనుల నాణ్యతను, ఇటీవలే ఆర్డీ పోస్టులోకి ఇన్చార్జిగా వచ్చిన ఇరిగేషన్ ఇఇ కలిసి జిల్లా కలెక్టర్ కి నివేదించాల్సి వుంటుంది. చూడాలి ఎండీ కి రిఫరెన్సు లేకుండా డైరెక్టుగా ఏపీటీడీసి జిల్లా మేనేజర్ అయినా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు పేపర్ పై పెడతారా..లేదంటా రాష్ట్ర అధికారులు గీసిన లక్ష్మణ రేక దాట కుండా.. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తారా అనేది...?!