రాష్ట్రవ్యాప్తంగా చాత్తాద శ్రీ వైష్ణువుల బలం, బలగం ఏంటో తెలియజేస్తాం..!


Ens Balu
5
visakhapatnam
2024-12-16 14:07:39

ఆంధ్రప్రదేశ్ లోని చాత్తాద శ్రీ వైష్ణవుల సామాజిక వర్గం బలం, బలగం తెలియజేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీల ద్వారా కుల గణన(వివరాల నమోదు) చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చాత్తాద శ్రీ వైష్ణువుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,  ప్రముఖ సినీ నిర్మాత, టిడిపీ నేత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డా..కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అన్ని రాజకీయపార్టీలకు తమ సామాజిక బలం అధికారికంగా, లిఖిత పూర్వకంగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ కమిటీలను ఒక తాటిపైకి తీసుకు వస్తున్నామన్నారు. 

అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోని తమ సామాజిక వర్గం వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేసి.. వివరాలు, ఓట్లు, యువత, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల సమాచారం క్రోడీకరించడం ద్వారా తమ సామాజిక బలం సంఖ్య తెలియజేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ సామాజిక వర్గం తర తరాల నుంచి వెనుకబడి పోతుందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం ఇంకా పెరగాల్సి వుందన్నారు. దానికోసం సామాజిక వర్గంలోని  వివరాలు సేకరించి నమోదు చేయడం ద్వారా ఎవరి పరిస్థితి ఏంటో కూడా ప్రభుత్వాలకి తెలియజేయడానికి  అవకాశం వుంటుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేరుకి కార్పోరేషన్ ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయాలేదన్నారు. 

దేశవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో వున్న చాత్తాద శ్రీ వైష్ణవుల సంఖ్య అధికారికంగా తెలియాలంటే కుల గణన జరగాలన్నారు. వాటిని ప్రభుత్వం చేపట్టడకపోవడంతో రాష్ట్ర సంఘం చొరవ తీసుకొని తమ సామాజిక వర్గం వివరాలు నమోదు చేసే కార్యాచరణకు ఉపక్రమించామని స్పష్టం చేశారు. పూర్వం రోజుల నుంచి వెనుకబడి ఉన్న తమ సామాజిక వర్గం బలం రాజకీయపార్టీలకు తెలియజేయడం ద్వారా తామేంటో తెలియజేస్తామన్నారు. దానికోసం సంక్రాంతి పండుగ తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల జనాభా వున్నతమపై కేవలం 34 వేల మంది మాత్రమే ఉన్నారనే ముద్ర వేయడం సరికాదని.. అలాంటి అసత్యప్రచారాలను పూర్తి వివరాలతోనే త్వరలో ఘాటుగా తిప్పికొడతామన్నారు. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కమిటీలను సమాయత్తం చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ రికార్డుల్లో వున్న యాచక వృత్తి అన్న పదాన్ని తొలగించడం కోసం సమస్త సమాచారంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల దృష్టికి సామాజిక వర్గం వివరాలు తీసుకెళ్ల నున్నట్టు డా..కంచర్ల అచ్యుత రావు మీడియాకి వివరించారు.