జగనన్న ప్రభుత్వంలో విద్యలో సమూల మార్పులు..
Ens Balu
2
Kurupam
2020-10-09 16:00:32
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. బాలల బంగారు భవిత కోసం ఎన్నటికీ తరగని, ఎవరూ దోచుకోలేని ఆస్తిగా విద్యను ప్రతీ పేద కుటుంబానికి అందిస్తున్నారని చెప్పారు. తండ్రి తర్వాత అమ్మ తరుపు నుంచి పిల్లల భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించే మేనమామ తరహాలోనే పేద పిల్లలను గురించి ఆలోచిస్తున్నారని కితాబిచ్చారు. కురుపాంలోని ఏపీ మోడల్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రచర్ల పరీక్షిత్ రాజు, జిల్లా విద్యశాఖాధికారి నాగమణి , పార్వతీపురం ఐటీడీఏ పిఓ కూర్మనాథ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పుష్ప శ్రీవాణి తన చిన్న నాటి పాఠశాలను గుర్తు చేసుకున్నారు.. ‘‘ మా నాన్న స్కూలు టీచర్ అయినా నలుగురు పిల్లలను చదివించడం కష్టంగానే ఉండేది.. నేను గిరిజన ఆశ్రమపాఠశాలలో డే స్కాలర్ గా చదువుకున్నాను. మా స్కూలు ఊరి నుంచి 2 కి.మీ దూరంలో ఉండేది. మా దగ్గరున్న బుక్కులు, నోటు పుస్తకాలను పెట్టుకోవడానికి బ్యాగు కూడా ఉండేది కాదు.. అందుకే అంత దూరం కూడా పుస్తకాలను చేత్తో పట్టుకొని నడుచుకుంటూ స్కూలుకు వెళ్లే వాళ్లం..అప్పట్లో బాగా ఉన్న వాళ్ల పిల్లలకే స్కూలు బ్యాగులు ఉండేవి.. ఎవరైనా మంచి బ్యాగు తెచ్చుకుంటే అలాంటిది మాకూ ఉంటే బాగుండేది కదా అని ఆశగా చూసేవాళ్లం.. స్కూల్లో కూర్చోవడానికి టేబుళ్లు కూడా ఉండేవి కావు, నేల మీద కూర్చొనే చదువుకున్నాం.. ఇక ఫ్యాన్లు లైట్టు లాంటివేమీ ఉండేవి కావు.. బోర్డు మీద అక్షరాలు రాస్తే అక్షరాలు కూడా కనిపించేవి కావు.. అలాంటప్పుడు పిల్లలం మేమే పలకాకు, మసి బొగ్గును నూరి బోర్డుకు పూస్తే అప్పుడు అక్షరాలు కనిపించేవి.. సిగ్గు విడిచి చెప్పుకుంటున్నా.. ఆడపిల్లలం ఉన్నా మా కోసం కనీసం బాత్ రూములు కూడా ఉండేవి కావు.. నాతోటి పిల్లల తల్లిదండ్రులు కూడా వారిని చదివించే ర్థిక స్థోమత లేక అర్ధాంతరంగా వారి చదువులను మాన్పించేసారు...’’ అని వెల్లడించారు. అంత దారుణంగా ఉండేవి అప్పటి పరిస్థితులని వాపోయారు. పిల్లల భవిష్యత్తు గురించి తండ్రి తర్వాత అమ్మతరుపున అంతగా ఆలోచించేది మేనమామ అని ప్రస్తుతం ముఖ్యమంత్రి జగననన్న కూడా ఒక మేనమామ తరహాలోనే ఆలోచిస్తున్నారని పుష్ప శ్రీవాణి ప్రశంసించారు. పేదలకు తమ పిల్లల చదువులు భారం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి పేదతల్లికీ 15 వేల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందించారని ప్రస్తావించారు. యూనిఫాంలు, మంచి బ్యాగు, షూస్ బెల్టు, బూట్లు లాంటివన్నీ ఇచ్చి కలిగిన వారి పిల్లలు చదివే కార్పొరేట్ స్కూలు పిల్లల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలు కూడా ఉండాలని సీఎం సంకల్పించారని చెప్పారు. ఒకవైపు పిల్లలకు అవసరమైన సామాగ్రిని జగనన్న విద్యా కానుకగా అందిస్తూనే మరోవైపున ప్రభుత్వం చేపట్టిన మనబడి.. నాడు నేడు పథకాలు గవర్నమెంట్ స్కూళ్ల దుస్థితిని మార్చే విప్లవాత్మకమైన పథకాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల పాఠశాలల్లో నాడు నేడు పథకంలో భాగంగా పెద్ద భవనాల్లో ఉపయోగించే నాణ్యమైన, ఖరీదైన సామాగ్రిని ఉపయోగిస్తున్నారని, పాఠశాలలకు అవసరమైన ఫ్యాన్లు, లైట్లు, టేబుళ్లు, కుర్చీలు, బాత్ రూములు, తాగునీటి వసతి, కాంపౌడ్ గోడలు వంటి మౌలిక వసతులన్నింటినీ అందిస్తూ వాటి రూపురేఖలను మారుస్తున్నారని వివరించారు. ఎన్నటికీ తరగనిది, ఎవరూ దోచుకోలేని ఆస్తి విద్య అని దాన్ని ప్రతి పేద విద్యార్థికి అందించే దిశగా ముఖ్యమంత్రి విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నారని అభిప్రాయపడ్డారు. మాతృభాష అయిన తెలుగుతో పాటుగా బంగారు భవిష్యత్తును అందించే ఆంగ్ల మాధ్యమాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రస్తుతం తెలుగుతో పాటుగా ఇంగ్లీషులోనూ పాఠాలున్న మిర్రర్ ఇమేజ్ పుస్తకాలను ఇచ్చారని గుర్తు చేసారు. ఈ సందర్భంగానే కురుపాం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన విద్యార్థులకు పుష్ప శ్రీవాణి జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఐ.టి.డి.ఎ, ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి, ట్రైబల్ వెల్ఫేర్ డి డి కిరణ్ కుమార్,పి.హెచ్ఓ చిట్టిబాబు, డిప్యూటీ డి. ఇ. ఓ మోహన రాయుడు, ఎ. ఎం.సి చైర్మన్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, ఎంపిడివో లు, తహశీల్దార్లు, ఎం.ఇ.ఓ లు, వివిధ శాఖల అధికారులు విద్యార్ధిని విద్యార్థులు తల్లి,దండ్రులు తదితరులు పాల్గొన్నారు.