నెలల పిల్లలకు కరోనా సోకుతుంది జాగ్రత్త..


Ens Balu
0
Sankhavaram
2020-10-13 08:32:19

గర్భిణీ స్త్రీలు, అపుడే పుట్టిన బిడ్డల నుంచి నెలల పిల్లల వయస్సు వున్నవారిని కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారి డా.ఆర్వీవి సత్యన్నారాయణ సూచించారు. శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో 5నెలల పసిబిడ్డ కరోనా వైరస్ తో మ్రుతిచెందిన విషయాన్ని పిల్లల తల్లులు గుర్తుపెట్టుకోవాలన్నారు. వైరస్ ఎప్పుడు ఏ విధంగా ఎవరికి వస్తుందో తెలియకుండా ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది సలహాలు పాటించడంతోపాటు నిత్యం చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చిన్నపిల్లలను బయటకు తీసుకొచ్చే సమయంలోనూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.  ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తక్షణమే ఆరోగ్య సహాయకుల ద్వారా పేర్లు నమోదు చేసుకొని పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ లో ఉండి వైద్యం పొందేందుకు కూడా మెడికల్ కిట్లు కూడా అందజేస్తున్నట్టు డాక్టర్ ఆర్వీవి సత్యన్నారాయణ వివరించారు.