సచివాలయాలపై ప్రజలకు నమ్మకం పెరగాలి..


Ens Balu
1
Uravakonda
2020-10-13 15:22:55

సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, సచివాలయాన్ని, పరిసరాలను ఎలాంటి చెత్తాచెదారం లేకుండా నిత్యం పరిశు భ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో రిజిస్టర్ లను, ప్రభుత్వ పథకాల పోస్టర్లను, ఉద్యోగుల హాజరు పట్టికను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు సచివాలయానికి ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పెండింగ్ లేకుండా సచివాలయానికి వచ్చే సర్వీసులకు త్వరితగతిన పరిష్కారం చూపించాలని, వివిధ రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించి వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలో రిజిస్టర్ లను సక్రమంగా మెయింటైన్ చేయాలని, ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళినా రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే అర్జీదారులతో బాధ్యతగా వ్యవహరించి వారికి అవసరమైన సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మునివేలు, డిజిటల్ అసిస్టెంట్ షమీర్, వెల్ఫేర్ అసిస్టెంట్ దుర్గ, మహిళా పోలీసు శిరీషా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.