వరాహానది గట్లు పటిష్టానికి శాశ్వత పరిస్కారం..


Ens Balu
1
s.rayavaram
2020-10-17 18:40:14

విశాఖజిల్లాలో కోతకు గురవుతున్న వరాహానది గట్లు పటిష్టానికి శాశ్వత  చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ తెలియజేసారు.   జిల్లాలో  గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎస్.రాయవరం మండలం సోముదేవుపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తో కలిసి  పర్యటించారు.  కోతకు గురైన వరహనది గట్లను,రోడ్లను  పరిశీలించారు.  వరహానది మ్యాప్ ను పరిశీలించిన అనంతరం ఈ గట్లు కోతకు గురవడానికి గల కారణాలను  అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రోయిన్ నిర్మాణం జరిగిన చోట ఈ సమస్య తలెత్తడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వరహానది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ గట్లు పటిష్ఠ పరిచేందుకు తీసుకున్న చర్యలు గూర్చి ఇరిగేషన్ డి.ఇ సుజాత ను అడిగి తెలుసుకున్నారు. .ఈ సమస్య పరిస్కారం కు ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేశామని డి.ఇ చెప్పడంతో త్వరితగతిన పనులు జరిగేలా చూడాలన్నారు. అనంతరం పాయకరావుపేట అతిథి గృహం వద్ద నియోజకవర్గ పరిధి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తుపాను కారణంగా నష్టపోయిన వరద బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు.  అలాగే పంట నష్టం అంచనా వేసి పూర్తి సమాచారం తో ,నష్టపోయిన రైతుల వివరాల తో కూడిన నివేదికను జిల్లా కార్యాలయంకు పంపించాలని ఆదేశించారు. ఈ వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భవిష్యత్తులో ఎటువంటి వరద వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలాగా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు గట్లు డిజైన్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.  అలాగే ఈ విషయం పై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ తో పాటు జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో గ్రోయిన్ డిజైన్ లో మార్పు కారణంగా గట్లు కోతకు గురయ్యాయని స్థానికులు తెలియజేసారని,  దీనిపై పూర్తి సమాచారం కొరకు  ఎస్.ఈ నుంచి నివేదిక కోరానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పంట నష్టం సుమారు ఆరు వేల హెక్టార్లలో రూ.70 కోట్లుగా  ప్రాథమిక అంచనా వేస్తున్నా మని కలెక్టర్  తెలిపారు. పూర్తి స్థాయి సమాచారంతో  సోమవారం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, యితర అధికారులు పాల్గొన్నారు.