వరదల పంట నష్టం రూ.8వేల కోట్లు..
Ens Balu
1
Chodavaram
2020-10-18 17:34:34
విశాఖ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సుమారు రూ.8 వేల కోట్లకు పైగా పంటనష్టం జరిగిందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవిఎన్ మాధవ్ అన్నారు. ఆదివారం చోడవరం మండలంలో చాకిపల్లి, కన్నంపాలెం, రామజోగిపాలెం పర్యటించిన ఆయన ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంతవరకు వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేయడానికి గ్రామాలను రాకపోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెండు నెలల్లో కోతకు రాబోతున్న వరిపంట ముంపుకు గురి కావడం వల్ల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అన్నారు. అధికారులు స్పష్టంగా పంటనష్టాలను అంచనా వేయాలని లేదంటే చాలా మంది రైతులు అన్యాయమైపోతారన్నారు. నేటికీ చాలా ప్రాంతాలు వరద ముంపు నీటిలో ఉన్నాయన్నారు. పత్తిపంటలు కూడా చాలా చోట్ల మునిగిపోయాయని ఎమ్మెల్సీ చెప్పారు. ఈయన వెంట స్థానిక బీజేపి నాయకులు పాల్గొన్నారు.