కరోనా ప్రొటోకాల్ తప్పక పాటించాలి..


Ens Balu
1
Srikakulam
2020-10-27 21:53:23

కరోనాకు సంబంధించి వాలంటీర్లకు, ఏ.ఎన్.ఎంలకు అప్పగించిన ప్రొటోకాల్ పనులను తూ.చ తప్పక పాటించాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు స్పష్టం చేసారు. ప్రతీ వాలంటీరుకు 50 గృహాలను సందర్శించి కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, నిర్ణీత ఫారంలో వివరాలు సంబంధిత సచివాలయానికి అప్పగించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఆ వివరాలతో ఏ.ఎన్.ఎం కరోనా లక్షణాలు గల వ్యక్తికి ఆక్సిజన్ లెవెల్స్ పరిశీలించి, 94 కంటే తక్కువగా ఉన్నవారిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టాలని, ఇదంతా కరోనా ప్రొటోకాల్ లోని భాగమేనన్న సంగతిని ఆయన గుర్తుచేసారు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరంలేదని, కానీ అలా చేయడంలేదని మండిపడ్డారు.  మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం మండల అధికారులు, ఏ.ఎన్.ఎంలు, సర్వేలైన్స్ అధికారులతో జె.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగోలు, ఖాజీపేట సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించడం జరిగిందని, అక్కడ కరోనా వివరాలు తెలియజేసే రికార్డులు గాని, వాలంటీర్లు పంపవలసిన ఫారాలు లేవని, దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇకపై ఇటువంటువి పునరావృతం కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు. సర్వేలో వివరాలు తెలియజేయకుండా కరోనా లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే సంబంధిత వాలంటీర్, ఏ.ఎన్.ఎంలపై కఠిన చర్యలు తీసుకుంటామని జె.సి హెచ్చరించారు. అలాగే తీవ్రమైన లక్షణాలతో ఆసుపత్రిలో చేరితే సంబంధిత సర్వేలైన్స్ అధికారులపై చర్యలు తీసుకుంటామని మరోమారు హెచ్చరించారు. ప్రాణం ఎవరిదైనా ఒకటేనని, ఇందుకు చిన్నా, పెద్ద తారతమ్యం ఉండబోదన్నారు. ప్రతీ ఒక్కరి ప్రాణాలను రక్షించవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని, అందులో భాగంగా వాలంటీర్లకు కరోనా లక్షణాలు గల వ్యక్తుల వివరాలు సేకరించాలని చెప్పడం జరిగిందన్నారు. ఇందులో ఎటువంటి అలక్ష్యం వహించరాదని సూచించారు. గతంలో 40 ఏళ్లకు పైబడి కరోనా లక్షణాలు ఉన్నవారి వివరాలు మాత్రమే కోరడం జరిగిందని, ప్రస్తుతం అన్ని వయస్కుల వారి వివరాలు సేకరించమని తెలియజేయడం జరిగిందన్న సంగతిని జె.సి గుర్తుచేసారు. 40 ఏళ్లలోపు వ్యక్తులకు కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వారిని హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచి, హోమ్ ఐసోలేషన్ కిట్లను అందజేసి చికిత్సను అందించాలని ఏ.ఎన్.ఎంలకు సూచించారు. అలాగే 40 ఏళ్లు పైబడి కరోనా లక్షణాలు ఉన్నవారిని వ్యాధి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా పూర్తిగా పోలేదని, చిన్నపాటి నిర్లక్ష్యం వహిస్తే మరలా పెరిగే అవకాశముందని గుర్తించాలన్నారు. నవంబరు 2 నుండి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని, కావున వాలంటీర్లు, ఏ.ఎన్.ఎంలు కరోనా ప్రొటోకాల్ ను ఖచ్చితంగా అమలుచేయాలని జె.సి ఆదేశించారు. ఇప్పటివరకు వాలంటీర్లు, ఏ.ఎన్.ఎంలు, రెవిన్యూ, పారిశుద్ధ్యం, పోలీసు యంత్రాంగం తదితర విభాగాలు అందించిన సహకారంతో జిల్లాలో కరోనాను నియంత్రించగలిగామని, ఇదే స్పూర్తితో రానున్న రెండు, మూడు మాసాలు కృషిచేస్తే జిల్లా నుండి కరోనాను పూర్తిగా నియంత్రించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.  ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మండల తహశీల్ధారు వై.వి.ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి ప్రకాశ్ రావు, సర్వేలైన్స్ అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.