వరలక్ష్మి కుటుంబానికి రక్షణ కల్పిస్తాం..


Ens Balu
1
Gajuwaka
2020-11-02 19:08:27

దిశా చట్టం చేసిన తరువాత జరిగిన 390 ఘటనలలో 7రోజులలో దర్యాప్తు పూర్తి చేసామని , 108 మందికి శిక్షలు ఖరారు అయ్యాయని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత  అన్నారు.  గాజువాక మండలం  చినగంట్యాడ గ్రామం  సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని  సోమవారం నాడు ఉన్నతాధికారులతో కలసి మంత్రి పరామర్శించారు. రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చెక్కును వరలక్ష్మీ తల్లిదండ్రులు పద్మ ప్రియ, పి.సత్య గురునాథ్ లకు  హోంమంత్రి, జిల్లా కలెక్టరు వి.వినయ్  చంద్ , గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్  మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించి తక్షణం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకువచ్చిన దిశా చట్టం  స్పూర్తితో 7రోజులలో  దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేస్తామని అన్నారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని, నిందితుని తండ్రి ఇతర కుటుంబ సభ్యుల పై బైండోవర్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. చిత్తూరులో చిన్నారి బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో  నిందితునికి 7 నెలలలోనే ఉరిశిక్ష ఖరారు అయిందని తెలిపారు. విజయవాడలో  చిన్నారి పాపను అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో 4 నెలలలో నిందితునికి ఉరిశిక్ష పడిందని అన్నారు. 3,4 సంవత్సరాల వయస్సు గల  చిన్న పిల్లలపై కూడా  అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని, తెలిసిన వాళ్లే ఈ విధంగా పూనుకోవడం సభ్య సమాజం తలదించుకోవలసిన  పరిస్థితి అన్నారు.  ఇలాంటి సంఘటనలు జరగకుండా వుండడానికి పౌరులు కూడా  తమ వంతు బాధ్యత తీసుకోవాలని కోరారు సమాజంలో మార్పులు వస్తున్న క్రమంలో, ఆడా మగా సమానమని స్నేహ భావంతో మెలుగుతున్నప్పుడు, కొంతమంది ఈ విధమైన ఉన్మాధ చర్యలకు పూనుకోవడం బాధాకరమని అన్నారు.యుక్త వయస్సు వచ్చిన  పిల్లలకు తల్లిదండ్రులు భద్రత గురించి తెలియజేయాలని కోరారు. పాఠశాల స్థాయిలోనే మగపిల్లలకు ఆడపిల్లలతో ఏ విధంగా ప్రవర్తించాలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వుందని అన్నారు. చట్టాలపై మగ పిల్లలకు ఆడ పిల్లలకు అవగాహన కలిగించడానికి తగు చర్యలు చేపడతామన్నారు.ప్రతి విద్యార్థిని దిశ యాప్, ఎ.పి.పోలీస్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు యుక్త వయస్సు వచ్చిన ఆడ పిల్లలు  బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా అల్లరి పెడితే, ఇబ్బందికర పరిస్థితులకు గురి చేస్తే తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావాలని  కోరారు. ఇలాంటి  సంఘటనలలో పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదు ఇచ్చినప్పుడు కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి వారికి  కౌన్సిలింగ్ ఇప్పించి  మళ్లీ వాటికి పూనుకోకుండా హెచ్చరించ వలసిన అవసరం వుందన్నారు. జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్  బాధిత కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిశా చట్టం ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, ఎ.సి.పి.రామాంజనేయ రెడ్డి, ఆర్.డి.ఒ. పి.కిషోర్ , గాజువాక యం.ఆర్.ఒ. యం.వి.ఎస్.లోకేశ్వరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.