20న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
Ens Balu
2
2020-11-04 15:32:04
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 20వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి. మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని, రైతు భరోసా కేంద్రాలకు వీటిని అనుసంధానం చేయాలని తెలిపారు. కంప్యూటర్లు, తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు, స్కానర్లు, నాణ్యత కిట్లు, పొట్టు తీసే పరికరాలు కొనుగోలు కేంద్రాలలో తప్పని సరిగా సమకూర్చుకోవాలన్నారు. ఈ నెల 15వ తేదీ నాటికి తప్పని సరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పరికాలన్నీ అందుబాటులో వుంచాలని తెలిపారు. రైతుల కళ్ళాల వద్దకు టెక్నికల్ సిబ్బంది వెళ్ళాలన్నారు. నాణ్యత పరీక్షలు టెక్నికల్ అసిస్టెంట్లు ట్యాబ్ ల ద్వారా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యావసాయ శాఖ, సివిల్ సప్లైలు సహకారంతో కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని చెప్పారు. రైతులు ఈ క్రాప్ నమోదు తప్పని సరిగా చేసుకోవాలన్నారు. రైతులకు లబ్ది చేకూర్చాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, జి.సి.సి. మేనేజరు జి.నరసింహులు, డి.ఆర్.డి.ఎ. ఎ.పిఎం.లు, మన్యదీపిక సి.ఇ.ఓ. కైలాస్ సాహు, వంశధార సి.ఇ.ఓ. బి.సుజాత, వర్షిణి సి.ఇ.ఓ. పి.రాంబాబు, నేచురల్ బాస్కెట్ సి.ఇ.ఓ. టి.మురళి, సునర్ణముఖి సి.ఇ.ఓ. ఎస్.తులసి పాల్గొన్నారు.