అనంతకు ధీటుగా పంచాయితీల అభివ్రుద్ధి..


Ens Balu
2
ఎస్.నారాయణపురం
2020-11-10 17:50:24

అనంతపురం నగరానికి దీటుగా నియోజకవర్గంలోని నాలుగు పంచాయతీలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎ.నారాయణపురం పంచాయతీలో మంగళవారం ‘జనం కోసం జనంలోకి’ కార్యక్రమం నిర్వహించారు. నారాయణపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత భువనేశ్వరనగర్, ఎస్సీ కాలనీ, వంక కొట్టాల, ఏఎస్‌ఆర్‌ నగర్‌లో ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరును ఎమ్మెల్యే అనంత తెలుసుకున్నారు. వృద్ధులు, వికలాంగులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ఎంతో ఆప్యాయంగా వారిని పలుకరిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు వాలంటీర్లు సరిగా పని చేయడం లేదని గ్రహించిన ఎమ్మెల్యే అనంత.. ప్రజల పట్ల బాధ్యతగా మెలగకుంటే విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరించారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి గడప వద్దకు చేర్చడానికి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామన్న విషయాన్ని సిబ్బంది, వాలంటీర్లు గుర్తుంచుకోవాలన్నారు. నారాయణపురం పంచాయతీలో ఇప్పటికే రూ.2.30 కోట్లతో కాలువలు, రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. మరో రూ.8 కోట్లు కేటాయించామని, మార్చిలోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అభివృద్ధికి కేవలం మాటలకే పరిమితం చేసిందని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 90 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. నారాయణపురం, రుద్రంపేట, రాజీవ్‌కాలనీ, అనంతపురం రూరల్‌ పంచాయతీల్లో కాలువలు, రోడ్లు లేవన్న మాటే రాకుండా పనులు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేకంగా క్యాలంటర్‌ ప్రకటించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని చెప్పారు. అధిక వర్షాలతో వేరుశనగ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని తెలిపారు.
సిఫార్సు