ఉద్దానం ప్రాజెక్ట్ వేగంగా పూర్తిచేయాలి..


Ens Balu
3
Srikakulam
2020-12-01 17:34:49

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం త్రాగునీరు ప్రాజెక్ట్ వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. ఉద్దానం తాగు నీటి ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం సమావేశం జరిగింది. ప్రాజెక్టు త్వరిగతగతిన పూర్తి కావాడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో అత్యద్భుత ప్రాజెక్ట్ గా నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేసారు. వంశధార నీటిని తాగు నీటిగా కల్పించడం వలన ఉద్దానం ప్రాంత ప్రజలు ఎన్నాల్లగానో వేచి చూస్తున్న శుద్ధ జలాలు అందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరగా పూర్తి చేసి ఉద్దానం ప్రజల కోరిక నెరవేర్చడమే కాకుండా వారి హృదయాల్లో నిలిచిపోవాలని అన్నారు. రహదారులు, భవనాల శాఖ, జాతీయ రహదారుల సంస్ధ ప్రాజెక్టు పైపు లైన్లు వేయునపుడు అవసరమగు అన్ని చర్యలు సకాలంలో పూర్తి చేసి పనులు వేగవంత కావడానిక చేయూతను అందించాలన్నారు. పైపులైను రూటులో ఉన్న జలవనరులు, వివిధ నిర్మాణాలు, చెరువులు, కాలువలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.       ఉద్దానం ఏడు మండలాల్లో  కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో శుద్ధ జలాలను రూ.7 వందల కోట్లతో తాగు నీటి ప్రాజెక్టును చేపట్టుటకు పరిపాలనాపరమైన ఆమోదాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. హిరమండలం వంశధార రిజర్వాయర్ వద్ద ఇంటేక్ వెల్ నిర్మించి అచ్చట నుండి పైపు లైను ద్వారా వజ్రపు కొత్తూరు మండలంలో 121 గ్రామాలు, పలాసలో 86 గ్రామాలు, మందసలో 225 గ్రామాలు, సోంపేటలో 74 గ్రామాలు, కవిటిలో 118 గ్రామాలు, కంచిలిలో 138 గ్రామాలు, ఇచ్ఛాపురంలో 45 గ్రామాలు వెరశి ఏడు మండలాల్లో 807 గ్రామాలకు తాగు నీటిని అందించుటకు ప్రతిపాదించడం జరిగింది. ఈ 807 ఆవాసాలలో 4.69 లక్షల మంది జనాభా నివశిస్తున్నారు. ప్రాజెక్టును 2051 సంవత్సరం వరకు అవసరాలకు తగిన విధంగా రూపకల్పన చేస్తున్నారు. ఏడాదికి 1.12 టిఎంసి నీరు అవసరమని గుర్తించడం జరిగింది. ఇందుకు 16 ప్రదేశాలలో ఓవర్ హెడ్ బేలన్సింగు రిజర్వాయర్లు, 23 ప్రదేశాల్లో గ్రౌండు లెవెల్ బేలన్సింగు రిజర్వాయర్లు నిర్మించుటకు, మెళియాపుట్టి మండలం మకనపల్లి, పలాస మండలం టెక్కలిపట్నం వద్ద హెడ్ వర్కులను ఏర్పాటు చేయుటకు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 1062 కిలోమీటర్ల మేర పైపు లైన్లు వేయుటకు, 51 సంపులు నిర్మించుటకు ప్రతిపాదించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, డివిజనల్ అటవీ అధికారి సందీప్ కృపాకర్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాసరావు, రహదారులు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు కె.కాంతిమతి, వంశధార పర్యవేక్షక ఇంజనీరు డోల తిరుమల రావు, ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీరు ఎన్.రమేష్, జాతీయ రహదారుల సంస్ధ ఇంజనీరు ఎస్.బసవ రాజు, సంబంధిత మండలాల తహశీల్దార్లు  తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు