అరకు ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలి..
Ens Balu
2
Araku Valley
2020-12-19 19:21:44
అరకు పర్యాటక ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడి రహదారులు,స్థానిక అభివృద్ధికే వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, అరకు పార్లమెంట్ డిస్టిక్ ఇన్చార్జి పాచిపెంట శాంతకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శనివారం ఆమె ఘాట్ రోడ్డులో మీడియాతో మాట్లాడుతూ, అరకు వేలి మండలం సుంకర మెట్టు పంచాయతీ గిరిజన ప్రాంతాల్లోని మన్యం అందాలను తిలకించడానికి వచ్చిన పర్యాటకులు చాల ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే అరచేతిలో ప్రాణం పెట్టుకొని వెళ్లాల్సివస్తోందన్నారు. రోడ్డు మార్గం ఎక్కడ పడితే అక్కడ పెద్దపెద్ద గోతులుతో, రోడ్డు వెడల్పు సరిగా లేక పోవడం వల్ల రాకపోకలు నిలిచి ప్రయాణికులకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. రహదారులు సరిగా లేకపోవడంతో వాహనాలు విపరీతంగా రావడం వల్ల చాలా ట్రాఫిక్ ఏర్పడుతోందన్నారు. ఎక్కువగా యాక్సిడెంట్లు కూడా జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేసారు. నిత్యం అనేకమంది ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ రహదారిపై ప్రయాణిస్తున్న రహదారి బాగుకోసం దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు. టురిజం వల్ల వచ్చే కోన్ని వేల కోట్లు ఆదాయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అందరికీ ఉపయోగ పడుతుందన్నారు. టూరిజం నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఏమిచేస్తోందని ఘాటుగా ప్రశ్నించారు. అరకు మన్యంలోని ఏజెన్సీ గిరిజన 11 మండలాల ప్రాంతం పల్లె గ్రామాల రోడ్డు మార్గాలు పరిస్థితులు కుడా అద్వాన్నంగా ఉన్నాయని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఏజెన్సీ 11 మండలాల ఆదివాసిలకు,టురిస్టులకు,ప్రయాణికులకు రహదారుల నిర్మాణాలు చేపట్టి రక్షణ కల్పించాలని శాంతకుమారి డిమాండ్ చేసారు.