మా జీతాలు ఇప్పించండి మహాప్రభో..
Ens Balu
3
s.rayavaram
2020-12-19 21:31:08
తమకు రావాల్సిన 23 నెలల జీతాలు ఇప్పించి తమను ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం మండలం, సైతారుపేట గ్రామ సచివాలయంలో స్వీపర్లుగా పనిచేస్తున్న చింతాడ పెంటయ్య, చిన్న పెంటయ్యలు అధికారులను వేడుకుంటున్నారు. శనివారం ఈమేరకు తమకు జరిగిన అన్యాయంపై వారు స్థానిక మీడియాతో మాట్లాడారు. గ్రామసచివాలయ అధికారులు తమకు రావలసిన జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తున్నారు. కోవిడ్ కాలంలో కూడా గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యం పణంగా పెట్టి పనిచేసినా జీతాలు సక్రమంగా రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. గత 23 నెలలకు తనకు కేవలం రూ15,000 మాత్రమే ముట్టిందని పెంటయ్య, తనకురూ16,000 ముట్టిందని చిన పెంటయ్య మీడియాకి వివరించారు. రోజుకు ఒక్కొక్కరికి 200 చొప్పున నెలకు 6,000 ఇస్తామని అధికారులు తెలిపారన్నారు. సచివాలయ సెక్రెటరీని ఎప్పుడు అడిగినా నా చేతి సొమ్ము ఇస్తున్నానని, బిల్లులు రాలేదని తెలుపు తున్నారని చెబుతున్నారు. సుమారు రెండేళ్లుగా పనిచేయించుకొని తమకు రావాల్సిన జీతాలు ఇవ్వకపోతే తాము ఎలా బతుకుతామని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై గ్రామ సయవాలయ ప్రత్యేక అధికారి ఎం.పి.డి.ఓ చంద్రశేఖర్ ను అడుగగా పరిశీలించి సమస్యను పరిష్కస్తామని హమీ ఇచ్చారని వారు తెలియజేశారు.