గ్రామసచివాలయ వ్యవస్థ మరింత బలోపేతం..
Ens Balu
3
Kothapalli
2020-12-21 21:02:31
సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారుల గడప వద్దకు చేర్చే ప్రతిష్టాత్మక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజా సహకారంతో మరింత బలోపేతమవుతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం యు.కొత్తపల్లి మండలంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన యండపల్లి గ్రామ సచివాలయం-1 నూతన భవనాన్ని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2021, మార్చి 31 నాటికి జిల్లాలో అన్ని సచివాలయాలకు శాశ్వత భవన నిర్మాణాలను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవన నిర్మాణాలపై ఇటీవల నియోజక వర్గాల వారీగా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించామన్నారు. గతంలో గ్రామ స్థాయిలో ఏదైనా కార్యక్రమం లేదా సమావేశం నిర్వహించాలంటే మౌలిక వసతులు ఉండేవి కావని, ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సచివాలయాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాలకు మించి సచివాలయాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. సచివాలయ ఇంజనీరింగ్ సహాయకుడు ఆధ్వర్యంలోనే నాణ్యతతో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎలాగూ రావనే ఉద్దేశంతో గతంలో రైస్‌కార్డు, పెన్షన్, ఇంటిపట్టాలు వంటి వాటికి దరఖాస్తు కూడా చేసుకునేవారు కారని, ప్రస్తుతం సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందని పేర్కొన్నారు. పెన్షన్ కోసం అవ్వాతాతలు ఎంతో కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఒకటో తేదీనే తెలవారకముందే వలంటీర్లు పెన్షన్ మొత్తాన్ని అందిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు, వాటిని పొందేందుకు అర్హతల వివరాలను వలంటీర్లు వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఎవరూ అడగాల్సిన అవసరం లేకుండానే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేస్తున్న వ్యవస్థలుగా సచివాలయాలు, వలంటీర్లు గుర్తింపు సాధించారని పేర్కొన్నారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ఈ నెల 25న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రారంభించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 3.80 లక్షల ఇంటి పట్టాల పంపిణీ జరగనుందన్నారు. గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలకు కూడా శాశ్వత భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అమూల్ ప్రాజెక్టు ద్వారా పాడి రైతులకు ఎంతో మేలు జరగనుందని, ప్రైవేటు సంస్థల కంటే ఎక్కువ మొత్తాలు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయని వివరించారు. యండపల్లిలో గ్రామ సచివాలయం అద్భుతంగా ఉందని, ఇదే స్ఫూర్తితో మిగిలిన సచివాలయాల నిర్మాణాలు జరగాలని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఏ గ్రామంలోని ప్రజల సమస్యల్ని అదే గ్రామంలో పరిష్కరించే అద్భుత వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందిందని, ఆయన ఆశయాల స్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించిన కాంట్రాక్టర్‌ను కలెక్టర్, ఎమ్మెల్యేలు సత్కరించారు. కార్యక్రమంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.