డొంకిన వలసకు పాఠశాల భవనం..


Ens Balu
5
Paderu
2020-12-22 18:56:54

పాడేరు మండలంలోని గన్నేరుపుట్టు పంచాయతీ మారుమూల గిరిజన గ్రామం డొంకినవలస గ్రామంలో ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల మంగళవారం పర్యటించారు. ఐటిడిఏ వెలుగు టిపి ఎం యు ఆధ్వర్యంలో రూ.3.5లక్షల వ్యయంతో నిర్మించిన గ్రావిటీ పధకాన్ని పరిశీలించారు. నాలుగు నెలల క్రితం సుడిపల్లి వెంకటరావు డయేరియాతో మృతి చెందారని తెలుసుకుని గ్రామానికి తాగునీటి పధకాన్ని మంజూరు చేసారు. కొండపై నిర్మించిన గ్రావిటీ పధకాన్ని కాలినడకన వెళ్లి నీటి నాణ్యతలను,ట్యాంకులను పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును పరిశీలించి మంచినీటిని తాగి సంతృప్తి వ్యక్తం చేసారు. గ్రామంలో 10 కుళాయిలు ఏర్పాటు చేసామని నిర్వహకులు వివరించారు. నాలుగున్నర కిలోమీటర్ల దూరం నుంచి పైపులైన్లు వేసి డొంకినవలసకు గ్రావిటీ పధకం నిర్మించామన్నారు. గ్రామస్తులు పూలదండలు వేసి , బియ్యపుబొట్టులు పెట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన తాగునీటి పధకాన్ని సక్రమంగా నిర్వహించుకోవాలని సూచించారు. చిన్న చిన్న మరమ్మతులు వస్తే పరిష్కరించుకోవాలని పెద్ద సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామన్నారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవన నిర్మాణం మధ్యలో నిలిచిపోయిందని పూర్తి చేయించాలని గ్రామస్తులు కోరగా పి ఓ సానుకూలంగా స్పందించారు. గ్రావిటీకి సమీపంలో ఉన్న మచ్చల మామిడి, చట్టూరు గ్రామాలకు గ్రావిటీ పధకం మంజూరు చేయాలని డొంకిన వలస గ్రామస్తులు కోరగా ప్రాజెక్టు అధికారి సానుకూలంగా స్పందించి అంచనాలు రూపొందించాలని వెలుగు అధికారులను ఆదేశించారు. రాగులు, ధాన్యం ఓల్డా రైతు భరోసా కేంద్రానికి తీసుకుని వెళ్లి విక్రయించాలని రైతులకు సూచించారు. రాగులు, రాజ్మాకు ప్రభుత్వం అత్యధిక ధర చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బంది, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.