ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి..
Ens Balu
4
Vizianagaram
2020-12-23 14:26:24
విజయనగరం జిల్లాలో ఈనెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు పిలుపు ఇచ్చారు. బుధవారం మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా ఈనెల 30న ముఖ్యమంత్రి గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్లు, ఇళ్లస్థలాలు పంపిణీ చేయనున్నామని చెప్పారు. గతంలో డా.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో 24 లక్షల ఇళ్లను ఇందిరమ్మ పథకంలో నిర్మించామని, ఆ తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ నేతృత్వంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై పరిశీలన నిమిత్తం మంత్రి బొత్స సత్యనారాయణ రూరల్ మండలం గుంకలాంలో సి.ఎం. కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలసి బుధవారం పర్యటించారు. జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వారికి ముఖ్యమంత్రి పర్యటనకు చేస్తున్న ఏర్పాట్లపై వివరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో 1,07,181 మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి పొసెషన్ పత్రాలు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో 71,237 మందికి కొత్తగా పట్టాలు ఇస్తున్నామని, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న 24,237 మందికి పొసెషన్ సర్టిఫికెట్లు అందించనున్నామని, టిడ్కో ఇళ్లను కూడా అందజేయనున్నట్టు తెలిపారు. ఒక్క గుంకలాంలోనే 10 వేల మందికి ఇళ్లపట్టాలు మంజూరు చేస్తూ కొత్తగా అక్కడ ఒక టౌన్ షిప్‌నే నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా దాదాపు 1830 ఎకరాల్లో రూపొందించిన 1164 లే అవుట్లలో 71,237 మందికి పట్టాలు మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. 1140 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు వ్యక్తుల నుండి సేకరించిన 690.82 ఎకరాలను కలుపుకొని లే అవుట్లు రూపొందించడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రయివేటు భూముల కొనుగోలు కోసం రూ.228 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిసెంబరు 25న మధ్యాహ్నం 2-00 గంటల తర్వాత ఇళ్లపట్టాల పంపిణీని చేపట్టాలని, 30న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మధ్యాహ్నం తర్వాత మాత్రమే పంపిణీ చేపట్టాలన్నారు. వచ్చే జనవరి 7వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌లో చేరుకోనున్నారని, దాదాపు రెండు గంటల పాటు ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చే లబ్దిదారులకు గాని, పార్టీ కార్యకర్తలకు గానీ ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత అధికారులపై వుందన్నారు. ముఖ్యంగా పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. జాతీయ రహదారి నుండి సభాస్థలికి చేరుకొనేందుకు వుండే అన్ని మార్గాలను వాహనాల రాకపోకలకు వీలుగా మరమ్మత్తులు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్‌ను మంత్రి ఆదేశించారు. పట్టణంలోని ఇళ్లస్థలాల లబ్దిదారులు సభాస్థలికి చేరుకొనేందుకు వీలుగా అవసరమైన బస్సులను ఆర్టీసీ నుండి సమకూర్చాలని ప్రాంతీయ మేనేజర్‌ను మంత్రి ఆదేశించారు. తాను ఈనెల 30వ తేదీ వరకు జిల్లాలో అందుబాటులో వుంటానని ఏర్పాట్ల విషయంలో ఏమైనా సందేహాలుంటే తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వహిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ పర్యటన ఏర్పాట్లపై వివరిస్తూ గుంకలాంలో 12,301 మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. విజయనగరం పట్టణ పరిధిలోని ఇళ్లులేని నిరుపేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 75 వేల మందికి ఇళ్లస్థలాలు, 8 వేల మందికి టిడ్కో ఇళ్లను పంపిణీ చేయనున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం కోసం సభా ప్రాంగణంలో మూడు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రముఖుల వాహనాలకోసం, ఇళ్లస్థలాల లబ్దిదారులను తీసుకువచ్చే వాహనాలకోసం వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. లబ్దిదారులు వాహనం దిగిన తర్వాత ఎక్కువ దూరం నడవకుండా సభా ప్రాంగణానికి సమీపం వరకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ సి.ఎం. కార్యక్రమం ఏర్పాట్లను పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయనున్నారని, పైలాన్, మోడల్ ఇళ్ల నిర్మాణం బాధ్యతలను జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) డా.ఆర్. మహేష్ కుమార్ పర్యవేక్షిస్తారని, సభాస్థలి వద్ద ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు పర్యవేక్షిస్తారని తెలిపారు. వేదిక ఏర్పాట్లను డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కె.సుబ్బారావు, సభకు హాజరైన వారికి సంబంధించిన ఏర్పాట్లను సాంఘిక సంక్షేమశాఖ డి.డి. సునీల్ రాజ్‌కుమార్ పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎం.ఎల్.సి. పెనుమత్స సురేష్‌బాబు, శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య, వైఎస్ఆర్‌సిపి జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్‌లు డా.జి.సి.కిషోర్ కుమార్, డా.ఆర్.మహేష్‌కుమార్, జె.వెంకటరావు, సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, డి.ఆర్.ఓ. ఎం.గణపతిరావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, ఏ.ఎస్.పి. శ్రీదేవి రావు, డి.ఎస్.పి. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు గుంకలాం సభాస్థలి వద్ద ఏర్పాట్లను మంత్రి బొత్స సత్యనారాయణ, సి.ఎం. కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు అధికారులతో కలసి పరిశీలించారు. హెలిపాడ్, పైలాన్, మోడల్ హౌస్ నిర్మాణాలు జరిగే ప్రాంతం, సభావేదిక తదితర మూడు చోట్ల సి.ఎం. కార్యక్రమాలు వుంటాయని కలెక్టర్ వివరించారు. పైలాన్ నిర్మాణాన్ని మంత్రి బొత్స తదితరులు పరిశీలించారు. సభావేదిక నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో హెలిపాడ్ వుంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్‌లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.