సీఎం వైఎస్ జగన్ పర్యటనకు భారీ భద్రత..
Ens Balu
3
యు.కొత్తపల్లి
2020-12-23 15:45:55
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి పర్యటనకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి చెప్పారు. ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులతో కలిసి కలెక్టర్.. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 25వ తేదీన నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని భారీ లేఅవుట్ ప్రాంతంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. దీనికోసం ప్రత్యేక పోలీసు బృందాలకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. హెలీప్యాడ్ నుంచి మోడల్ హౌస్, పైలాన్ ప్రాంతం మీదుగా సభావేదిక వద్దకు ముఖ్యమంత్రి చేరే మార్గాన్నిపరిశీలించారు. పారిశుద్ధ్య చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం తదితరాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్, ట్రెయినీ కలెక్టర్ అపరాజితాసింగ్, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, ఆర్‌డీవోలు, ప్రాజెక్టు డైరెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.