చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్సీపీ ప్రభుత్వం..
Ens Balu
4
Salur
2020-12-24 17:51:10
ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేసే ప్రభుత్వం తమదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి, ప్రజారంజక పాలనను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికే దక్కిందని ఆయన కొనియాడారు. ఎన్నికల మేనిఫేస్టో తమ పార్టీకి భగవద్గీతతో సమానమని ఆయన పేర్కొన్నారు. సాలూరులో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పాదయాత్రలో సాలూరు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, వంద పడకల ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మంజూరు చేశారని, దీని నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. వైద్యుల సంఖ్యను 52కి పెంచుతామని, శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆసుపత్రిలో పరికరాల కొనుగోలుకు మరో రూ.50లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇకనుంచీ మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి, విశాఖపట్నానికి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, సుమారు రూ.653 కోట్లతో జిల్లాలో వివిధ ఆసుపత్రుల నిర్మాణం, అభివృద్ది జరగనుందని చెప్పారు. త్వరలో జిల్లా కేంద్రం విజయనగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కూడిన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
ఉత్తుత్తి ప్రచారార్భాటాలతో గత ప్రభుత్వం ఐదేళ్లు ఏమీ చేయకుండానే పబ్బం గడిపిందని మంత్రి విమర్శించారు. పేదల భూమిని కాపాడేందుకు, వారికి శాశ్వత హక్కు కల్పించేందుకు సమగ్ర భూ సర్వే ప్రారంభిస్తే, దానిపైనా ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలందరికీ గూడు కల్పించేందుకు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పర్వదినం నాడు శుక్రవారం రాష్ట్రంలో సుమారు 30లక్షల, 78వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, అర్హులైనవారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా, వారికి 90 రోజుల్లో ఇంటి పట్టా మంజూరవుతుందని అన్నారు. సుమారు 20 ఏళ్లపాటు పేదలనుంచి నెలకు రూ.3వేలు చొప్పున అద్దె ముక్కు పిండి వసూలు చేస్తూ, టిట్కో ఇళ్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయిస్తే, తమ ప్రభుత్వం కేవలం రూపాయికే వారి పేరిట ఇంటిని రిజిష్టర్ చేసి ఇవ్వబోతోందని, ఇదే నాటి ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికీ తేడా అని స్పష్టం చేశారు. వివక్షతకు తావివ్వకుండా, అవినీతి రహితంగా, పార్టీలకు అతీతంగా, అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తోందని మంత్రి చెప్పారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా వైద్యారోగ్య రంగంలో కోట్లాది రూపాయల వ్యయంతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని చెప్పారు. వైద్యులనుంచి, సిబ్బంది వరకూ అన్ని స్థాయిల్లోని సిబ్బందిని పెద్ద ఎత్తున భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న నినాదంతో, జిల్లాలో పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం నినాదాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే జగనన్న పచ్చతోరణం కార్యక్రమం క్రింద జిల్లాలో సుమారు కోటి,36లక్షల మొక్కలనాటి, ఇటీవలే జాతీయ స్థాయిలో గుర్తింపును పొందామని కలెక్టర్ అన్నారు.
సాలూరు శాసనసభ్యులు పీడిక రాజన్నదొర మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి పెద్ద ఎత్తున పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, దానిలో భాగంగానే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని అన్నారు. దీనివల్ల ప్రతీ మారుమూల గిరిజన పల్లెకు కూడా ప్రభుత్వ సేవలు, సౌకర్యాలు అందుతున్నాయని చెప్పారు. సామాన్య ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 30లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి శుక్రవారం శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో కనీసం త్రాగునీటికి కూడా నిధులు మంజూరు కాలేదని, తమ ప్రభుత్వం సుమారు రూ.64కోట్ల వ్యయంతో వందేళ్లకు సరిపడే నీటి పథకాన్ని నిర్మిస్తోందని తెలిపారు. వందల కోట్ల వ్యయంతో తన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఎంఎల్ఏ వివరించారు.
ఈ సమావేశంలో పార్వతీపురం ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఎపిఎంఎస్ఐడిసి ఇఇ సత్యప్రభాకర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, తాశీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపిడిఓ పార్వతి, పలువురు ఇతర అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.