సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
3
Komaragiri
2020-12-24 18:54:03
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద శుక్రవారం కొమరగిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ వంగా గీతా, ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్, పెండెం దొరబాబు తదితరులతో కలిసి కలెక్టర్.. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. యు.కొత్తపల్లి మండలంలోని కొమరగిరి గ్రామ పరిధిలో 322 ఎకరాల 31 సెంట్ల విస్తీర్ణంలో భారీ లేఅవుట్‌ను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ విభాగాల సమన్వయంతో లబ్ధిదారుల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేశామని, ఇక్కడ మొత్తం 16,689 ప్లాట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తయిందన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించామని, కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, కార్యక్రమానికి వచ్చేలా చూస్తున్నామన్నారు. సభా ప్రాంగణంలో వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం-జిల్లా స్వరూపం
- ప్రతిష్టాత్మక నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 3,84,218 మంది లబ్ధిపొందనున్నారు.
- మొత్తం లబ్ధిదారుల్లో 2,58,236 మంది గ్రామీణ లబ్ధిదారులు కాగా, పట్టణ ప్రాంత లబ్ధిదారులు 1,25,982 మంది.
- పథకం అమల్లో భాగంగా తొలిదశ కింద 1,53,626 గృహాలు మంజూరుకాగా, వీటికి సంబంధించి ఎస్సీ లబ్ధిదారులు 30,156 మంది, ఎస్‌టీ లబ్ధిదారులు 6,399 మంది, బీసీ లబ్ధిదారులు 69,186 మంది, ఓసీ లబ్ధిదారులు 47,885 మంది ఉన్నారు.
- ఇళ్ల స్థలాల లబ్ధిదారుల కోసం 7,218 ఎకరాల 62 సెంట్ల భూమి అవసరం కాగా.. 1,856.55 ఎకరాలను ప్రస్తుతమున్న ప్రభుత్వ భూమి నుంచి సేకరించారు. మిగిలిన 5,362.07 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 5,850 మంది రైతుల నుంచి సేకరించారు.
- భూ సేకరణకుగానూ జిల్లాకు రూ.3167.97 కోట్లు మంజూరు కాగా.. ఇందులో రూ.2566.39 కోట్లు ఖర్చయింది.
- జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,160 కోట్లు ఖర్చు చేయనుంది.
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో రూ.540.89 కోట్ల అంచనా వ్యయంతో 1532 లేఅవుట్‌లను అభివృద్ధి చేశారు.