అక్కా చెల్లెమ్మలకు “ఇళ్ళ పట్టా”భిషేకం..
Ens Balu
5
Amadalavalasa
2020-12-25 17:32:43
పేద అక్కాచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాభిషేకం జరుగుతోందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామంలో శుక్ర వారం జరిగిన కార్యక్రమంలో శాసన సభాపతి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,75,755 మంది అక్కా చెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ళ స్ధలాల పట్టాల పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతంలో 1.50 సెంట్లు, పట్టణ ప్రాంతంలో ఒక సెంటు భూమిని జగనన్న ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.23,535 కోట్ల మార్కెట్ విలువగల 68,361 ఎకరాల భూమిని ఉచిత ఇళ్ళ పట్టాలుగా పంపిణీ జరుగుతుందని గుర్తు చేసారు. రాష్ట్రంలోని పేదలందరికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టుటకు ప్రభుత్వం సంకల్పించిందని అందులో మొదటి దశలో రూ. 28,080 కోట్ల అంచనా వ్యయంతో 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వై.యస్.ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.21.345 కోట్ల విలువైన 2.62 లక్షల టిడ్కో గృహాల సేల్ అగ్రిమెంట్లను కూడా అక్కాచెల్లెమ్మలకు నేడు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. 1,43,600 మంది లబ్దిదారులకు 300 చదరపు అడుగులు టిడ్కో గృహాలను కేవలం రూపాయికే ప్రభుత్వం అందిస్తుందని ఆయన అభినందించారు. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్ళకు లబ్దిదారులు కట్టవలసిన ముందస్తు వాటాలోని 50 శాతం సొమ్ము కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, లబ్దిదారుల తరపున రూ.4,287 కోట్ల అదనపు భారాన్ని జగనన్న ప్రభుత్వమే భరిస్తుందని శాసన సభాపతి అన్నారు. పేద వారి సొంత ఇంటి కల నెరవేరుతుందని, జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం చేపట్టిందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆహ్లాదకర వాతావరణంలో లే అవుట్లను తయారు చేయుట జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 95,408 మంది అర్హులైన లబ్దిదారులు, పట్టణ ప్రాంతాల్లో 27,654 మంది లబ్దిదారుల వెరశి 1,23,062 మంది లబ్దిదారులు ఉన్నారని చెప్పారు. 64,448 మందికి ఇళ్ళ పట్టాలు జారీ చేయడమే కాకుండా, 90 రోజుల పథకం క్రింద 1496 మందికి ఇళ్ళ పట్టాలు, భూమిపై ఉన్న 53,074 మందికి స్వాధీన పత్రాలను, జి.ఓ 463 క్రింద ఆక్రమిత స్ధలాల్లో ఉన్న 172 మందికి పట్టాలు మంజూరు జరుగుతుందని తెలిపారు. 1227.17 ఎకరాల ప్రభుత్వ స్ధలం, 568.63 ఎకరాలు సేకరించి పట్టాల పంపిణీకి లే అవుట్లు తయారు చేయడం జరిగిందని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో 1,128 లే అవుట్లలో 42,615 ఇళ్ళ స్ధలాలు ఏర్పాటు చేయగా, పట్టణ ప్రాంతంలో 28 లే అవుట్లలో 23,329 ఇళ్ళ స్ధలాలను ఏర్పాటు చేసామని వెరశి 1,156 లే అవుట్లలో 65,944 ఇళ్ళ పట్టాలను ఏర్పాటు చేసామని తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి 41,683 మంది లబ్దిదారులకు ఇళ్ళ స్ధలాలు జారీతో పాటు, 90 రోజుల పథకం క్రింద 932 ఇళ్ళ స్ధలాలు, భూమిపై ఉన్న 52,621 మందికి స్వాధీన పత్రాలను జారీ చేయడం జరుగుతుందని, జి.ఓ 463 మేరకు 172 మందికి క్రమబద్ధీకరణ జరుగుతుందని జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకుగాను 1087.70 ఎకరాల ప్రభుత్వ భూమి, 280.30 ఎకరాల భూ సేకరణ జరిగిందని చెప్పారు.
పట్టణ ప్రాంతాల్లో 27,654 మంది లబ్దిదారులకు గాను టిడ్కో గృహాల్లో పట్టణ ప్రాంతాల్లోని 3,872 మంది లబ్దిదారులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, 22,765 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలను మంజూరు చేయుట జరుగుతుందని తెలిపారు. 90 రోజుల పథకం క్రింద 564 మందికి, భూమిపై ఉన్న 453 మందికి స్వాధీన పత్రాలను జారీ చేయడం జరుగుతుందని, పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ భూమి 139.47 ఎకరాలు ఉండగా, 288.33 ఎకరాలు భూ సేకరణ చేసామని ఆయన వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా అమలు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఇళ్ళ నిర్మాణానికి లబ్ధిదారులకు ప్రభుత్వం మూడు ఐచ్చికాలను ఎంపిక చేసుకొనుటకు ఇచ్చిందని పేర్కొన్నారు. మంచి కార్యక్రమాలకు రాద్దాంతం చేయరాదని ఆయన కోరారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై ప్రతి ఒక్కరూ స్వాగతించాలని, పేద పిల్లలు సైతం ఉన్నత చదువులు చదవాలని అన్నారు. పోటీతత్వంలో మన పిల్లలు ముందుండి భారత కీర్తి ప్రతిష్టలు పెంచుటకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గృహ నిర్మాణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న లబ్దిని వివరించారు. ఇళ్ల నిర్మాణం వలన వివిధ ప్రక్రియల పరంపరలో ఆర్ధిక వ్యవహారాలు ఎక్కువ అవుతాయని ఆయన పేర్కొన్నారు.
వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ కార్యక్రమాలను పారదర్శకంగా ప్రభుత్వం చేపడుతుందన్నారు. జిల్లాలో మొదటి విడతలో 97,616 ఇళ్లను రూ. 3 వందల కోట్లతో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. జనవరి 7వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
లబ్దిదారు సైలాడ శైలజ మాట్లాడుతూ ఏఈ రోజు మహిళలకు నిజంగా మంచి రోజు అన్నారు. ఉండటానికి ఇళ్ళు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. నేను ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి జగనన్న భరోసా ఇస్తున్నారు. కరోనా సమయంలో సైతం ఉచిత రేషన్ పంపిణీ చేశారని సంతోషం వ్యక్తం చేశారు.
ఎండ జ్యోతి రత్నం మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఒక అన్నగా అండగా నిలుస్తున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నా పేరుతో ఒక ఇంటిని జగనన్న ఇస్తూ ఆశీర్వదిస్తున్నారు. జగనన్న తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ వలన ప్రతి పథకం ఇంటి వద్దనే అందుతున్నాయి.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు రాష్ట్ర శాసన సభాపతి సీతారాం పట్టాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఐ. కిశోర్, జిల్లా బాలురు, బాలికల క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్, తహశీల్దార్ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ ఏఇ కూర్మి నాయుడు, మునిసిపల్ కమీషనర్ రవి సుధాకర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.