పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం..
Ens Balu
3
Amadalavalasa
2020-12-28 18:30:31
పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం లక్ష్మీ నగర్, నాయుడుకాలనీ , పాతినవారి పేట, బొడ్డేపల్లి పేట 8 వార్డులకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సోమ వారం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా దాదాపు 815 పట్టాలను పేదలకు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ పేద ప్రజలకు గూడు కల్పంచాలనే ఆశయంతో ఇళ్ళ స్ధలాల పంపిణీ ప్రారంభించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,75,755 మంది అక్కా చెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ళ స్ధలాల పట్టాల పంపిణీ జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతంలో 1.50 సెంట్లు, పట్టణ ప్రాంతంలో ఒక సెంటు భూమిని జగనన్న ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.23,535 కోట్ల మార్కెట్ విలువగల 68,361 ఎకరాల భూమిని ఉచిత ఇళ్ళ పట్టాలుగా పంపిణీ జరుగుతుందని గుర్తు చేసారు.
రాష్ట్రంలోని పేదలందరికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టుటకు ప్రభుత్వం సంకల్పించిందని అందులో మొదటి దశలో రూ. 28,080 కోట్ల అంచనా వ్యయంతో 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగిందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వై.యస్.ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.21.345 కోట్ల విలువైన 2.62 లక్షల టిడ్కో గృహాల సేల్ అగ్రిమెంట్లను కూడా అక్కాచెల్లెమ్మలకు నేడు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, హౌసింగ్ అధికారులు వర్మ, బొడ్డేపల్లి కోటేశ్వరరావు, స్ధానిక నాయకులు జే.జే.మోహన్ రావు, జే.కే.వెంక బాబు, బొడ్డేపల్లి అజంత కుమారి, అల్లంశెట్టి ఉమామహేశ్వర రావు, పొన్నాడ చిన్నా రావు తదితరులు పాల్గొన్నారు.