ఎంపీడీఓ, కార్యదర్శిలకు మెమోలు..


Ens Balu
3
Jalumuru
2021-01-02 18:26:10

శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం గొటివాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి జి.వెంకటేష్ కు, జలుమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎం.పి.డి.ఓ)కు మెమోలు జారీ చేసినట్లు వార్డు, గ్రామ సచివాలయం, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు తెలిపారు. సారవకోట మండలం బుడితి, నరసన్నపేట మండలం ఉర్లాం, జలుమూరు మండలం గొటివాడ గ్రామ సచివాలయాలను శని వారం తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ సచివాలయంలో ప్రభుత్వం సూచించిన మేరకు ప్రభుత్వ పథకాల వివరాలు తెలియజేసే సమాచారం అందుబాటు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. గొటివాడలో ప్రభుత్వ పథకాల సమాచారం అందుబాటులో పెట్టనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ కు మెమో జారీ చేసారు. పర్యవేక్షణ లోపభూయిష్టంగా ఉన్నందుకు ఎం.పి.డి.ఓకు కూడా మెమో జారీ చేసారు.  ప్రభుత్వ పథకాల జాబితాను ప్రజల సమాచార నిమిత్తం సచివాలయాల్లో బహిరంగంగా ప్రదర్శించాల్సిందేనని ఆయన స్పష్టం చేసారు. వివిధ పథకాల క్రింద అర్హత సాధించిన లబ్దిదారుల జాబితా సైతం ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో వివిధ విభాగాల సహాయకులు తు.చ తప్పకుండా విధులు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను నిర్ధేశిత సమయంలో పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేసారు. సమయానుసారం ప్రభుత్వం, ఉన్నత అధికారుల నుండి అందే ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు విధులు నిర్వహించి విజవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయంలో వాహనాలు నిలుపుదల చేయరాదని, వాహనాల పార్కింగుకు సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు.
సిఫార్సు