సచివాలయాలను శుభ్రంగా ఉంచాలి..
Ens Balu
3
Madakasira
2021-01-02 18:58:43
అనంతపురం జిల్లా సచివాలయంలో గడువు దాటి ఒక్క సమస్య కూడా పెండింగ్ ఉంచరాదని, ఎప్పటికప్పుడు సచివాలయానికి వచ్చే సర్వీసులకు పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం మడకశిర మండలం లోని కదిరేపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయంకు వచ్చే సర్వీసులను పరిష్కరించేందుకు ప్రతిరోజు పర్యవేక్షించాలని ఎంపీడీవోను ఆదేశించారు. కదిరేపల్లి సచివాలయంలో 12 గడువు తీరిన సర్వీసులు పెండింగ్ ఉండడం పట్ల నిర్ణీత సమయంలో పరిష్కరించాల్సిన సమస్యలను ఎందుకు పెండింగ్లో ఉంచారని ప్రశ్నించారు. ఆదివారం లోపు అన్ని గడువు దాటిన సమస్యలన్నింటిని పరిష్కరించాలని ఆదేశించారు. సర్వీసులకు గడువు దాటినా కూడా పరిష్కారం చూపించక పోవడం, సచివాలయాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడంతో డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు జాగ్రత్తగా పని చేసి ఎప్పటికప్పుడు సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సచివాలయంలో శుభ్రత పాటించాలని, పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వాలి..
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇంటి పట్టాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని, ఏ ఒక్కరూ మిస్ కావడానికి వీలులేదన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గూగుల్ మ్యాప్ లో సచివాలయాన్ని మ్యాపింగ్ చేశారా లేదా అని ఆరా తీశారు. అంతకుముందు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వివరాలని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రాజ్ గోపాల్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.