రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంచాలి..
Ens Balu
3
Visakhapatnam
2021-01-18 15:07:03
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 32వ జాతీయ భద్రతా మాసోత్సవాలను జిల్లా తరఫున కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ తో కలసి మంత్రి సోమవారం ప్రారంభించారు. గతంలో ఒక వారం రోజుల పాటు రోడ్డు భద్రతా వారోత్సవాలను చేసేవారని, ప్రస్తుతం రోడ్డు భద్రతా మాసోత్సవాలను జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రమాదాలు నివారణకు అవకాశం ఉంటుందన్నారు. స్కూల్ లు, కళాశాలల ప్రిన్సిపాల్ లతో అధికారులు ఒక సమావేశం ఏర్పాటుచేసి వారిలో అవగాహన కల్పించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా చూడాలని, హెల్మెట్ లను విధిగా ధరించాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్.జి.ఓ.లు మాసోత్సవాల్లో పాల్గొన్నాలన్నారు. వేగం కంటే ప్రాణం మిన్నా, ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొన్నారు. రహదారుల భద్రతా మాసోత్సవాలలో అందరూ పెద్ద ఎత్తున భాగస్వాములవ్వాలన్నారు. అందరూ అవగాహన పెంచుకొని ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలపై బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజక వర్గం శాసన సభ్యులు కంబాల జోగులు, ఉప రవాణా కమీషనర్ రాజరత్నం, ట్రాఫిక్ ఎసిపి బాపూజి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.