పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు..


Ens Balu
3
Chittoor
2021-02-03 22:39:45

చిత్తూరు జిల్లాలో ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా సచివాలయంలో చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ ఎం.హరినారాయణన్ గారిని అధికారులు కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలను తెలియజేశారు.  ఈ సంధర్భంగా నూతన కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఎ.సి)గా విధులు నిర్వహించిన జాయింట్ కలెక్టరైన (రెవెన్యూ) డి.మార్కండేయులు, జిల్లా పంచాయతీ అధికారి, ఎన్నికల అధికారులతో చర్చించి ఎన్నికల నియమావళిని పాటిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో సమస్యలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి మేలుచేసే విధంగా పరిపాలన సాగిస్తానన్నారు. ప్రతి ఐ.ఎ.ఎస్ అధికారి సర్వీసులోకి వచ్చేటప్పుడు పారదర్శకమైన పరిపాలనతో ప్రజలకు మేలుచేయాలనే లక్ష్యంతోనే రావడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వ పధకాల అమలు మరియు పర్యవేక్షణ కొరకు నాకు ఈ అవకాశం కల్పించడం జరిగిందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ప్రజలకు సేవలను అందించే విధంగా పారదర్శకంగా పరిపాలన కొరకు చర్యలు తీసుకుంటానన్నారు.