స్వామి కల్యాణానికి పక్కాగా ఏర్పాట్లు..
Ens Balu
2
Antervedi Pallipalem
2021-02-05 21:12:30
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలకు అధికార యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో పర్యటక శాఖ అతిథిగృహంలో ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తదితరులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్.. జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఆర్‌టీసీ, అగ్నిమాపక, మునిసిపల్, వైద్య, ఆరోగ్య తదితర శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికను ఆయా శాఖల అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. 19వ తేదీన రథ సప్తమి రోజున సూర్య వాహనంపై గ్రామోత్సవం, ధూప సేవ, ముద్రికాలంకరణ, చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం కార్యక్రమాలతో కల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా చివరి రోజున 28వ తేదీన పుష్పక వాహనంపై గ్రామోత్సవం, హంస వాహనంపై తెప్పోత్సవం వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఏటా జరిగే కల్యాణ మహోత్సవాలకు చేసే ఏర్పాట్లకు అదనంగా ఈసారి కోవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, విధి నిర్వహణలో ఉన్నఅధికారులు, సిబ్బంది కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. అవసరం మేరకు మాస్కులు, శానిటైజర్లు వంటి సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ట అమలుపై అధికారులు దృష్టిసారించాలన్నారు. ఎన్నికలకు సమాంతరంగా స్వామివారి కల్యాణ ఉత్సవ పనులు చూడాల్సి ఉన్నందున సిబ్బంది కొరత లేకుండా చూసుకోవాలని.. అవసరం మేరకు కాకినాడ, పెద్దాపురం డివిజన్ల నుంచి అధికారులకు డిప్యుటేషన్‌పై విధులు కేటాయించాలని సూచించారు. ఈ నెల 19న జరిగే కార్యక్రమాలకు గౌరవ ముఖ్యమంత్రి అంతర్వేది వచ్చే అవకాశమున్నందున సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఉత్సవాల సమయంలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అంతర్వేది చేరుకునేందుకు 130 ప్రత్యేక బస్ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ఈ బస్సులతో పాటు వివిధ వాహనాల పార్కింగ్‌కు సౌకర్యాలు కల్పించాలన్నారు. కొత్తగా తయారుచేసిన స్వామివారి రథం ఫిట్‌నెస్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక పోలీసు బృందాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ శాంతిభద్రతలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమీక్షా సమావేశం తర్వాత కలెక్టర్, ఎస్‌పీ, డిప్యూటీ కలెక్టర్.. ఇతర అధికారులతో కలిసి కొత్త రథాన్ని పరిశీలించారు. తుది దశ పనులపై ఆరా తీశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం చేసుకున్నారు. తర్వాత స్థానిక రెవెన్యూ అతిథిగృహంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కేన్‌వీడీ ప్రసాద్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ అధికారి యర్రంశెట్టి భద్రాజీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కేవీఎస్ గౌరీశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.గాయత్రీదేవి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.