పాతూరు రూపురేఖలు మార్చి చూపిస్తా..
Ens Balu
2
Krishnadevipeta
2021-02-12 09:02:20
విశాఖజిల్లా, గొలుగొండ మండలంలోని ప్రతిష్టాత్మక క్రిష్ణదేవిపేట(పాతూరు) గ్రామాన్ని పూర్తిస్థాయిలో మార్చి చూపిస్తానని పంచాయతీ సర్పంచ్ బరిలో నిలబడిన పందిరి సత్యన్నారాయణ( సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు) పేర్కొన్నారు. కేవలం గ్రామ ప్రజలకు సేవ చేసుకోవడానికి మాత్రమే తాను చేస్తున్న ఉద్యోగాన్ని, లక్షల రూపాయల జీతాన్ని వదిలి సొంత గ్రామానికి వచ్చానని గ్రామస్తులకు తెలిపారు. గ్రామంలోని అన్ని వీధుల్లోనూ సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, చెత్త పడేయడానికి చెత్తబండ్లు, ఇంటింటికీ మంచినీటి కుళాయిలు, విద్యార్ధుల కోసం గ్రంధాలయం, యువత కోసం ఆటస్థలం ఇలా అన్నింటి కోసం శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని చెప్పారు. గ్రామంలో ఎంత మంది అర్హులుంటే అంత మందికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయం ద్వారా సేవలు పొందడం మన హక్కు అని, సేవలన్నీ ప్రజలకు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని సత్యంనాయుడు చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వం వచ్చిందని, ఈ ప్రభుత్వం ప్రజలకోసమే పనిచేస్తుందని అన్నారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎవరూ ఎవరినీ అర్ధించాల్సిన పనిలేదని, సంక్షేమ పథకాల కోసం ఎవరూ ఎవరికీ డబ్బులు కూడా ఇచ్చే పనికూడా లేదన్నారు. అందరికీ మీ ఇంటి మనిషిగా తోడుంటానని, మీ అందరికీ సేవ చేసుకుంటానని, ఇచ్చిన మాటకే కట్టుబడే ఉంటానని చెప్పారు. తనకి ఒక్క అవకాశం ఇస్తే క్రిష్ణదేవిపేటను పూర్తిగా అభివ్రుద్ధి చేసి జిల్లా మొత్తం మన గ్రామంవైపే తొంగి చూసేలా చేస్తానని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు.