4వ విడత ఎన్నికలు సజావుగా జరపాలి..
Ens Balu
2
Penugonda
2021-02-20 16:34:47
అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నాల్గవ విడత లో ఎన్నికలు నిర్వహించనున్న పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ ను సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ ఆదేశించారు. శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పెనుగొండ, సోమందేపల్లి ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నాల్గవ విడత పోలింగ్ పెనుగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆదివారం జరుగనుందని, ఇందుకు సంబంధించి పోలింగ్ నిర్వహణకు అవసరమైన మెటీరియల్ ను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సిబ్బంది అందరూ వారికి అందించిన బ్యాలెట్ బాక్సులను మరోసారి పరిశీలించాలని, అన్ని రకాల మెటీరియల్ అందిందా లేదా అన్నది చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్స్, ఇతర మెటీరియల్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిశాంతి, సబ్ కలెక్టర్ పెనుగొండ, తహశీల్దార్, పెనుగొండ, సోమందేపల్లి ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.