ఇబ్బందులు లేకుండా ఎన్నికలు జరగాలి..
Ens Balu
1
Penugonda
2021-02-20 17:33:49
అనంతపురం జిల్లాలో నాల్గవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెనుకొండ మండలం మావటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించాలని, భోజనాన్ని సకాలంలో అందించాలని, వారికి దిండ్లు, రగ్గులు, మ్యాట్ అందించాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్వో బుచ్చిబాబు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.