విశాఖజిల్లాలో 4వ దశ పోలింగ్ ప్రశాంతం..


Ens Balu
3
Anandapuram
2021-02-21 18:07:03

విశాఖ జిల్లాలో 4వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటీ వి వినయ్ చంద్ వెల్లడించారు.  4వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆనందపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆనందపురం, వెల్లంకి పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం డివిజన్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు 4వ దశ కూడా ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ లో పాల్గొన్నారన్నారు. రానున్న 5 సంవత్సరాలలో గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు అభ్యర్థి ని ఎన్నుకొనేందుకు చక్కని అవకాశమని వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. పెద్ద వయసు గల ఓటర్లను ఆశా కార్యకర్తలు సహాయంతో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు వివరించారు. ఉదయం 6.30 గంటల నుండే ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలిపారు.  డివిజన్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 6 మండలాల్లో 68  సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో వీడియో గ్రఫీ తీయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు, మెడికల్ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.  ఈ పర్యటనలో విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపిడిఓ ఎ. లవరాజు, తదితరులు పాల్గొన్నారు.