పేదలందరికీ ఇళ్లు సత్వరం పూర్తికావాలి..
Ens Balu
2
Vizianagaram
2021-02-23 16:32:40
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో గృహనిర్మాణ కార్యక్రమంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకూ జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ, రిజిష్ట్రేషన్, మ్యాపింగ్, జియో ట్యాగింగ్ తదితర ప్రక్రియలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మహేష్ కుమార్ మాట్లాడుతూ వారం రోజుల్లోగా రిజిష్ట్రేషన్, మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని మండలాల్లో పురోగతి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో అలక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి సాంకేతిక సహకారం కావాలన్నా అందిస్తామని, సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ నెలాఖరుకు పని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పారు. వంద ఇళ్లు దాటిన లేఅవుట్లను జిల్లా స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులకు చూపించి, వారి సహలహాలను తీసుకోవాలని సూచించారు. 2016 నుంచి 2019 వరకూ మంజూరైన ఇళ్ల స్థితిగతులపై నివేదికలను వెంటనే పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్‌వి రమణమూర్తి, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు కె.రామచంద్రరావు, కె.రాజ్‌కుమార్, హౌసింగ్ డిఇలు, ఏఈలు పాల్గొన్నారు.