ఇంటింటి రేషన్ పంపిణీ సంత్రుప్తికరం..
Ens Balu
3
Vizianagaram
2021-03-02 20:36:28
ఇంటింటికీ రేషన్ సరఫరా విధానం జిల్లాలో చక్కగా అమలవుతోందని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే దీనిని మరింత సౌకర్యకరంగా మెరుగు పరచాలని ఆదేశించారు. జిల్లాలో మిల్లర్ల పనితీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. కమిషనర్ శశిధర్ మంగళవారం జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. డెంకాడ మండలం జొన్నాడ గ్రామం, విజయనగరం పట్టణంలోని లంకాపట్నం, బొగ్గులదిబ్బ ప్రాంతాల్లో, ఎండియుల ద్వారా జరుగుతున్న రేషన్ పంపిణీని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శశిధర్ మాట్లాడుతూ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా జరుగుతున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను మరింతగా భాగస్వాములను చేయాలని ఆదేశించారు. వాలంటీర్లకు ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంచాలని, ఈ పాస్ వేసే పనిని వారికి అప్పగించాలన్నారు. సరుకులు పంపిణీ చేసే రోజుకు ఒకటిరెండు రోజుల ముందుగానే ఆయా ప్రాంత ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. వాహనం వెళ్లేందుకు వీలైన ప్రతీ వీధిలోకి వెళ్లి, సరుకులను పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వాహనాల వద్ద జనం గూమిగూడకుండా, క్యూలు ఏర్పాటు కావడం జరగకూడదని, వాహనం దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువమంది ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతీ ఇంటికీ తప్పనిసరిగా సంచుల ద్వారా సరుకులను అందజేయాలని సూచించారు. మురికివాడలు, కడు పేదలు నివశిస్తున్న ప్రాంతాల్లో ముందుగా సరుకుల పంపిణీ చేయాలన్నారు. రేషన్ డిపోల రేషనలైనేషన్ ప్రక్రియ ఈ నెలాఖరులు పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిశిఖర గ్రామాలకు వీలైనంత దగ్గర ప్రాంతాలకు వాహనాలను తీసుకువెళ్లి సరుకులను పంపిణీ చేయాలన్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఇంటిదగ్గరే రేషన్ సరుకులను అందుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, దానిని నెరవేర్చేవిధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు.
జిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియపై కమిషనర్ సమీక్షించారు. మిల్లింగ్ చేసి, బియ్యాన్ని తిరిగి ఇవ్వడంలో రైస్ మిల్లర్లు చేస్తున్న జాప్యంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సార్టెక్స్ ఎందుకు ఇవ్వడంలేదని మిల్లర్లను ప్రశ్నించారు. రోజుకు 4వేల టన్నులు చొప్పున, ఈ నెలాఖరునాటికి లక్షా,28వేల టన్నుల సార్టెక్స్ ఇవ్వాలని, ఇదే మిల్లర్లకు ఇస్తున్న చివరి అవకాశమని కమిషనర్ హెచ్చరించారు.
సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి.సిహెచ్ కిశోర్ కుమార్, పార్వతీపురం సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే, ఐటిడిఏ పిఓ ఆర్.కూర్మనాధ్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, డిఎస్ఓ పాపారావు, సివిల్ సప్లయిస్ డిఎం భాస్కర్రావు తదితర అధికారులు పాల్గొన్నారు.