మరింతగా సచివాలయ సేవలు అందించాలి..
Ens Balu
3
Samarlakota
2021-03-02 21:12:17
గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా&సంక్షేమం) రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం జేసి రాజకుమారి సోమర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఉన్న 1,2,3 సచివాలయలను సందర్శించి, రిజిస్ట్రర్లు తనిఖీ చేసారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ వైఎస్సార్ భీమా , ఆసరా,చేయూత,ఇతర పథకాలకు సంబంధించి ఏ దశలోను పెండింగ్ లేకుండా సిబ్బంది కృషి చేయాలన్నారు. గ్రామ సచివాలయలకు వివిధ సేవల నిమిత్తం వచ్చే దరఖాస్తులను తప్పనిసరిగా గడువు లోపు పరిష్కరించాలని ఆమె తెలిపారు. అనంతరం జేసి వేట్లపాలెం స్టేట్ బ్యాంకు వెళ్ళి , వైయస్సార్ చేయూత పథకం ద్వారా మేకలు గొర్రెలు, ఆవు గేదెల యూనిట్లకు సంబంధించి బ్యాంకు పరిధిలో ఉన్న 253 మంది లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి లబ్ధిదారులనుద్దేశించి మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా రూ.18,750 సొమ్ము మంజూరు అయిన లబ్ధిదారులకు పాడి పశువులను జీవనోపాధి గా ఎంచుకున్న వారికి రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారుగా 56,250 రూపాయలు ముందుగా బ్యాంకు ద్వారా రుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు.253 యూనిట్లకు గాను 60 యూనిట్లుకు గ్రౌండిగ్ పూర్తయిందని జేసీ తెలిపారు. లబ్ధిదారులు వారికి కేటాయించిన యూనిట్స్ ను సద్వినియోగం చేసుకుని చక్కని జీవనోపాధి పొందాలని ఆమె సూచించారు. ఈ వారంతానికి అన్ని యూనిట్లకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని బ్యాంకు సిబ్బందికి తెలిపారు.అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవల వివరాలు, బ్యాంకు లాగిన్ ప్రక్రియను జేసి పరిశీలించారు.
ఈ పర్యటనలో జేసి రాజకుమారి వెంట పశుసంవర్థక శాఖ జేడీ డా.ఎన్టీ శ్రీనివాస్ రావు,పీడీ డీఆర్డిఎ వై హరిహరనాథ్, ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.