నులిపురుగుల మాత్రలు తప్పక వేయించాలి..
Ens Balu
4
Kakinada
2021-03-03 17:41:01
నులిపురుగుల నిర్మూలనతో పిల్లలకు ఆరోగ్య పరంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ శ్రీనగర్‌లోని నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ దినం (deworming day) కార్యక్రమాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను అందించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేసుకోవడం వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుందన్నారు. రక్తహీనతను నియంత్రించి చిన్నారుల ఆరోగ్యకర జీవనానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, టెక్నికల్ కళాశాలలు; ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమానికి ముందు కాకినాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలో అమలవుతున్న స్వచ్ఛతా కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ప్లాస్టిక్, పగిలిన గ్లాసు, హానికర, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ తదితర వ్యర్థాలపై విద్యార్థులకు ఉన్న అవగాహనను చూసి, వారిని అభినందించారు. వ్యర్థాల విభజన, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రాలు, స్వచ్ఛ కాకినాడ-స్వచ్ఛ అంబాసిడర్, గ్రీన్ రిపోర్టు కార్డు తదితర వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తూ స్వచ్ఛసర్వేక్షణ్‌లో కాకినాడను ముందు నిలిపేందుకు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎంతో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమం సందర్భంగా జేసీ.. చిన్నారులతో ముచ్చటించారు. ఎంపిక చేసుకునే రంగం ఏదైనా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అహర్నిశలు కృషిచేయాలని విద్యార్థులకు సూచించారు. అదే విధంగా ఆధునిక శాస్త్రసాంకేతికతలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు జేసీ మార్గనిర్దేశనం చేశారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ డీఎంహెచ్‌వో ఎన్.ప్రసన్నకుమార్, సమన్వయకర్త డా. ప్రభాకర్, ఎంహెచ్‌వో డా. పృధ్వీచరణ్, పాఠశాల హెచ్ఎం ఎన్.నూకరాజు తదితరులు పాల్గొన్నారు.