స్త్రీ విద్య ద్వారా సమాజ పురోగతి..
Ens Balu
4
2021-03-08 13:57:21
స్త్రీలు విద్యావంతులైతే, సమాజం పురోభివృద్ది చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ స్పష్టం చేశారు. ఆడపిల్లలను కూడా బాగా చదివించాలని ఆయన కోరారు. జిల్లా మహిళాభివృద్ది, శిశు సంక్షేమశాఖ ఆద్వర్యంలో స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో సోమవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే, కుటుంబం తో పాటు, ఆ గ్రామం, తద్వారా సమాజం కూడా అభివృద్ది చెందుతుందనడానికి తన జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యుత్, రవాణా సదుపాయాలు కూడా లేని ఒక మారుమూల కుగ్రామంలో తాను జన్మించినప్పటికీ, తన తల్లి విద్యావంతురాలు కావడం వల్ల, తాను ఒక ఐఏఎస్ స్థాయికి ఎదిగానని చెప్పారు. తన అభివృద్దికోసం, తన మాతృమూర్తి, కన్నప్రేమను కూడా ప్రక్కనబెట్టి, తనను చిన్నప్పుడే చదువుకోసం దూరంగా పంపించారని తెలిపారు. తనతల్లి తనతోపాటు, గ్రామంలోని ఎందరినో విద్యావంతులను చేశారని, ఫలితంగా సుమారు 300 మంది ఉద్యోగాలను పొంది, గ్రామం ఎంతో అభివృద్ది చెందిందని తెలిపారు. చదువు సంస్కారాన్ని, వికాశాన్ని, ఉద్యోగాన్ని ఇవ్వడంతోపాటు అభివృద్దిని కూడా ఇస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్దిని సాధిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్‌గా తాను సాధించిన అవార్డులు, పురస్కారాలు, ప్రశంసలు వెనుక ఎంతోమంది మహిళా అధికారులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. మహిళా అధికారుల తోడ్పాటుతోపాటు, తన భార్యామణి సహకారం కూడా సంపూర్ణంగా లభించడం వల్లే విజయవంతమైన, ప్రజా కలెక్టర్‌గా ఈ మూడేళ్లు పనిచేయగలిగానని అన్నారు. కరోనా నియంత్రణలో కూడా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. జిల్లాను హరిత వనంగా మార్చేందుకు కృషి జరుగుతోందని, విజయనగరం పట్టణాన్ని ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దుతానని కలెక్టర్ తెలిపారు.
విపత్తుల నిర్వహణాశాఖ జిల్లా మేనేజర్ బి.పద్మావతి మాట్లాడుతూ, స్త్రీల సౌశీల్యాన్ని, వారి పురోగతిని చాటిచెప్పడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయని అన్నారు. స్త్రీ అక్షయ పాత్ర లాంటిదని, ఆమె సహనానికి, ఓర్పునకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో తల్లి,తండ్రి, గురువు తమ పాత్రలను సరిగ్గా పోషించి, నేటి తరాన్ని చక్కగా తీర్చిదిద్దనట్లయితే, స్త్రీలకు గౌరవం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. గతానికి భిన్నంగా ప్రస్తుత స్త్రీ అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతోందని చెప్పారు.
జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జె.విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రపంచంలోనే సగభాగమైన స్త్రీలు, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చెందినప్పుడే, మహిళా సాధికారత సాధ్యపడుతుందన్నారు.
అక్షరాశ్యులైన స్త్రీలు ఉద్యోగాలను పొందడం ద్వారా మహిళా సాధికారత దిశగా పయనిస్తున్నప్పటికీ, ఎంతోమంది మహిళలు నేటికీ వెనుకబడి ఉన్నారని, వారి అభ్యున్నతిపైనా దృష్టి పెట్టాలని కోరారు. మహిళాభివృద్దికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతినిస్తోందని, వారికోసం మాతృత్వ వందన, సంపూర్ణ పోషణ తదితర పలు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.
జిల్లా స్త్రీ,శిశు సంక్షేమశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.రాజేశ్వరి మాట్లాడుతూ విశ్వగమనానికి స్త్రీ మూలాధారమని పేర్కొన్నారు. చెల్లిగా, తల్లిగా, భార్యగా ఆమె బహుముఖ పాత్ర పోషిస్తూ, సమాజంలో సగభాగమై నిలిచిందన్నారు.
జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాతామహులు రత్నమ్మ, రామ్‌నాయక్‌లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు మహిళా అధికారులు డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, ఆర్‌వి నాగరాణి, చంద్రావతి, మంజులవాణి, విజయశ్రీ, మల్లికాంబ, అనురాధా పరశురామ్, ఎపిడి బి.శాంతకుమారి, పలువురు సిడిపిఓలు, సూపర్‌వైజర్లు, విశ్రాంత అధికారులు పాల్గొన్నారు.