సుస్థిర ఆదాయం పెంపొందించుకోవాలి..
Ens Balu
2
Karapa
2021-03-09 17:12:37
కుటుంబానికి సుస్థిర ఆదాయం అందేలా చేసేందుకు, మహిళా సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్ చేయూత పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి మహిళలకు సూచించారు. మంగళవారం కరప మండలంలోని ఆరట్లకట్ట గ్రామంలో వైఎస్సార్ చేయూత కింద పాడిపశువుల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్సార్ చేయూత పథకం పరిధిలో గ్రామంలో పాడిపశువులు పొందేందుకు 106 మందికి రుణాలు మంజూరు కాగా.. ఇప్పటికే 33 యూనిట్లు గ్రౌండ్ అయినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా అందించిన పాడి పశుపోషణతో ఆదాయంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుందని, కుటుంబానికి పోషణ భద్రత లభిస్తుందని వివరించారు. సచివాలయానికి అనుసంధానంగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటవుతున్నాయని, వీటివల్ల మహిళా పాల ఉత్పత్తిదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దళారుల ప్రమేయం లేకుండా మహిళా పాడి రైతులు అందించే పాలకు బయట మార్కెట్ కంటే ఎక్కువ ధర లభిస్తుందన్నారు. దీనికోసం ప్రభుత్వం అమూల్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని వివరించారు. అమ్మిన పాల పరిమాణం, వెన్న శాతం ఆధారంగా డబ్బులు నేరుగా మహిళల ఖాతాల్లో జమవుతుందన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, బ్యాంకులకు సక్రమ చెల్లింపుల ద్వారా ఏటికేడు అధిక ప్రయోజనం పొందాలని సూచించారు. అదే విధంగా పథకం ద్వారా లబ్ధిదారులు ఇచ్చిన ఆప్షన్ మేరకు మేకలు, గొర్రెలు యూనిట్లు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అల్లానా గ్రూప్ మీట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని, దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులకు ఎంతో ప్రయోజనం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం అమల్లో బ్యాంకర్ల పాత్ర ఎంతో ఉందని కలెక్టర్ ప్రశంసించారు. ఆరట్లకట్ట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ద్వారా జిల్లాలో అత్యధిక పశు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించడమే కాకుండా రూ.కోటికి పైగా రుణాలు అందించిన బ్రాంచ్ మేనేజర్ టి.కమలాకరరావును కలెక్టర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకు లింకేజీలో ఈ బ్రాంచ్ ముందుందని కలెక్టర్ ప్రసంశించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, పశుసంవర్థక శాఖ జేడీ ఎన్‌టీ శ్రీనివాసరావు, ఎల్‌డీఎం జె.షణ్ముఖరావు, కరప ఎంపీడీవో కె.స్వప్న తదితరులు పాల్గొన్నారు.