త్వరలోనే నల్లగొండకు పోస్టల్ సేవలు..
Ens Balu
3
నల్లగొండ
2021-03-15 20:10:03
విశాఖజిల్లాలోని కొయ్యూరు మండలం నల్లగొండ గ్రామానికి త్వరలోనే పోస్టల్ సేవలు అందనున్నాయి. ఈ మేరకు పోస్టల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నోఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో పోస్టల్ సేవలు విస్తరించాలని ప్రతిపాదనలు కేంద్రప్రభుత్వానికి, పోస్టల్ శాఖ ఉన్నతాధికారులకు వెళ్లినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల కాలంలో పోస్టల్ శాఖ తీసుకున్న ప్రత్యేక నిర్ణయాల కారణంగా ఈ గ్రామానికి పోస్టల్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతీ పోస్టాఫీసు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని ఈ శాఖ భావించింది. దీనితో విశాఖజిల్లాలో సుమారు 30 పోస్టాఫీసులు(బ్రాంచిలు) వేరే ప్రాంత బ్రాంచీల్లో విలీనం చేస్తున్నారు. మరికొన్నింటిని ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగానే నల్లగొండలో కొత్తగా పోస్టాఫీసు సేవలు ప్రారంభం అవుతున్నాయి. బ్రిటీషు సేనలపై అల్లూరి సీతారామరాజు మన్యం పితూరి ఉద్యమం జరిపే సమయంలో కొయ్యూరు నుంచి దగ్గర దారిలో క్రిష్ణదేవిపేట ప్రాంతానికి చేరుకునే సమయంలో ఈ గిరిజన గ్రామం మీదుగానే అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు రాకపోకలు సాగించేవారని చరిత్ర చెబుతున్నది. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామానికి పోస్టల్ సేవలు ప్రారంభం కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది..అన్నీ అనుకూలిస్తే మరో వారం రోజుల్లో పోస్టల్ సేవలు ప్రారంభం కానున్నాయి.