అనకాపల్లిలోని రేబాకలో పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన కోవిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ కేంద్రంలో సుమారు 200 పడకలు, వైద్యులు, మందులు సిద్దం చేశామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఎవరూ భయపడవద్దని, ప్రభుత్వం అన్నివిధాల ప్రజలను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. మాస్కు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీతారాం, తహశీల్దార్ శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ ఈశ్వర్రావు, వైద్యాధికారులు, జివిఎంసి సిబ్బంది పాల్గొన్నారు.