శంఖవరం మండలంలో జోరుగా ఫీవర్ సర్వే..
Ens Balu
3
Sankhavaram
2021-05-15 10:23:06
శంఖవరం మండలం లోని 14 పంచాయితీలు, 16 సచివాలయాల పరిధిలోని ఫీవర్ సర్వే శనివారం ప్రారంభమైంది. శంఖవరం, పెదమల్లాపరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని ఆశా కార్యకర్తలతో పాటు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో కుటుంబంలోని ప్రతీ సభ్యుల వారీగా జ్వరం, దగ్గు, రొంప, ఆయాసం వంటి ప్రాధమిక లక్షణాలను గుర్తించి వాటిని ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో ఆన్ లైన్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ వివరాలు ఆధారంగా అవసరమైన మందులను ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి తీసుకొని నేరుగా బాధితుల ఇంటి వద్దకే తీసుకువెళ్లి స్వయంగా అందజేస్తున్నారు. అవసరం, బాధితుల ఇష్టం మేరకు వారి అంగీకారంతో కరోనా తదితర పరీక్షలను నిర్వహించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఏఎన్ఎమ్ లు, వీఆర్వోలు పర్యవేక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల హంగూ ఆర్భాటం లేకుండా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 268 మంది వలంటీర్లు, శంఖవరం ఆస్పత్రి ఆశా కార్యకర్తలు 37మంది, పెదమల్లాపురం ఆస్పత్రి ఆశ కార్యకర్తలు 13 మంది పాల్గొన్నారు.