జగద్గురు ఆదిశంక రాచార్యుల జయంతి వేడుకలను విశాఖ శ్రీ శారదాపీఠం ఘనంగా నిర్వహించింది. సోమవారం ఉదయం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ శ్రీ శ్రీస్వాత్మానందేంద్ర రిషికేశ్ లోని విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆదిశంకరాచార్యునికి విశేష పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అధ్యాస భాష్యాన్ని పారాయణ చేసారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆదిశంకరులు యావత్ ప్రపంచానికే జగద్గురువులు అని కీర్తించారు. శంకరాచార్యులు రచించిన భాష్యాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోందని వివరించారు. శంకర భాష్యంపై ప్రపంచంలోనే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, తాత్వికవేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. దేవభూమిగా పేరున్న రిషికేశ్ ప్రాంతంలో పవిత్ర గంగానదీ తీరాన శంకర జయంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తన పరమ గురువులు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ స్వామి అనుగ్రహంతో ఈరోజు నుంచి మూడుపూటలా వేద విద్యార్థులకు శంకర భాష్యాన్ని బోధించనున్నట్లు ప్రకటించారు. చాతుర్మాస్య దీక్ష ముగిసే వరకు నాలుగు నెలల పాట ఈ పాఠాలు ఉంటాయని శ్రీ స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాల్లోను ఆదిశంకరుని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.