సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రిలో ఈఓ సంస్థ విరాళంగా అందించిన 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం కరోనా నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత సూచనల మేరకు ఈఓ (ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్) తరఫున హైదరాబాద్ లో ఉన్న ఈఓ మెంబర్ వడ్లమూడి శ్రీహర్ష ఆదేశాలతో ఒక్కొక్కటి 1 లక్ష 3 వేల రూపాయల విలువ చేసే 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ కు సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ఎంతో ముఖ్యమైనవన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్ లతో మాట్లాడుతూ ఈ ఓ సంస్థ అందించిన 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను నగరంలోని శారదా నగర్ లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న జర్మన్ హ్యాంగర్స్ తాత్కాలిక ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా విపత్కర సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత సూచనల మేరకు ఈఓ మెంబర్ వడ్లమూడి శ్రీహర్ష 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందించడం చాలా గొప్ప విషయమని, కరోనా వేళ సేవ చేసేందుకు, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈఓ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత సూచనల మేరకు ఈఓ మెంబర్ వడ్లమూడి శ్రీహర్ష ఆదేశాలతో రాష్ట్రంలో ఈరోజు ఏలూరు, అనంతపురం జిల్లాల్లో 50 చొప్పున ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ అందజేసినట్లు తెలిపారు. ఒక్కొక్కటి 1 లక్ష 3 వేల రూపాయల విలువ చేస్తాయన్నారు. ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను బ్యాంకాక్ నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో మాజీ మంత్రి పరిటాల సునీత అనంతపురం జిల్లాకు కూడా ప్రజల ప్రాణాల రక్షణకు అవసరమైన ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ అందజేయాలని తమ ఈఓ సంస్థ కు సూచించారన్నారు. మాజీ మంత్రి సూచనలతో ఈఓ సంస్థ మెంబర్ శ్రీహర్ష స్పందించి 50 ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందజేయాలని ఆదేశించడంతో ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను ఈరోజు జిల్లా కలెక్టర్ కి అందజేశామన్నారు. తమ సంస్థ తరఫున త్వరలోనే మరిన్ని ఆక్సిజన్ కాన్షన్ట్రేటర్స్ ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ మెంబర్లు కె.హరి, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.