విజయనగరం జిల్లాలో ఇ.ఎస్.ఐ. సంస్థ ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సహకారం వుంటుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. కార్మిక రాజ్య బీమా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ గతంలో మంజూరు చేసిన ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గాజులరేగ వద్ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి సమీపంలో గతంలో కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. అయితే గతంలో కేటాయించిన సర్వే నెంబరు పరిధిలోనే మరో చోట ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలాన్ని ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్థలం కూడా రోడ్డుకు ఆనుకునే వుందని, గతంలో కేటాయించిన స్థలానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఈ స్థలం వుందన్నారు. ఇందుకు ఇ.ఎస్.ఐ. సంస్థ సహకరించాలని సూచించారు. ఇ.ఎస్.ఐ. ఆసుపత్రికి స్థలం కేటాయింపుపై ఆ సంస్థ ప్రాంతీయ అధికారి ఇన్ చార్జి డిప్యూటీ డైరక్టర్ పి.ఎస్.పండా, జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, ఆర్.డి.ఓ. భవానీ శంకర్ తదితరులతో కలెక్టర్ సోమవారం తన ఛాంబరులో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ పరంగా ఉన్నత విద్యాసంస్థలేవీ లేవని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.110 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఒకే చోట 50 ఎకరాల స్థలం కేటాయించాల్సి వున్నందున గాజులరేగలో స్థలం కేటాయించామన్నారు. జిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మక వైద్య కళాశాల మంజూరైనందున దీని ఏర్పాటుకోసం జిల్లా కేంద్రంలో 50 ఎకరాల స్థలం ఒకేచోట కేటాయించవలసి వచ్చిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కేంద్రంలో రూ.75 కోట్లతో ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ 2019 డిశంబరు 19న శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కార్మిక మంత్రి జయరాం, స్థానిక ఎం.పి. ఎమ్మెల్యే తదితరులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆసుపత్రి ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇ.ఎస్.ఐ. సంస్థకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే శంకుస్థాపన జరిగినప్పటికీ ఇ.ఎస్.ఐ. సంస్థ ఇప్పటివరకు దీని నిర్మాణాన్ని చేపట్టలేదు.
ఈ సమావేశంలో ఏపి వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎస్.ఇ. శివకుమార్, ఇ.ఇ. సత్యప్రభాకర్, కలెక్టరేట్ సూపరిటెండెంట్ టి.గోవింద తదితరులు పాల్గొన్నారు.