కరోనా నేపథ్యంలో తాడిపత్రి వద్ద అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ సమీపంలో 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రిలో చేపడుతున్న పనుల పూర్తి పై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి, ఆర్డీవో గుణభూషణ్ రెడ్డి, డిఎంఅండ్హెచ్ఓ, ఎడి డ్రగ్స్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ, ఆర్అండ్ బి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ లు, ఏపిఎంఎస్ఐడిసి ఈఈలు, తదితరులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తాడిపత్రి వద్ద 500 ఆక్సిజన్ పడకలతో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేస్తోందని, నిర్దేశించిన సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. అన్నిరకాల పనులు పూర్తి చేసిన తర్వాత ముందుగా ట్రయల్ డెమో చేపడతామన్నారు. తాత్కాలిక ఆస్పత్రిలో పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు కోసం ఆక్సిజన్ మ్యానీ ఫోల్డ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, మ్యానీ ఫోల్డ్ ల తరలింపులో జాప్యం ఉండరాదన్నారు. త్వరితగతిన మ్యానీ ఫోల్డ్ లను తెప్పించాల ని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరాలో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యానీ ఫోల్డ్ లను ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా ఆటోమేటిక్ గా పనిచేసి ఆక్సిజన్ సరఫరా నిరంతరం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్జ్ ట్యాంక్, మ్యానీ ఫోల్డ్ యూనిట్లను ఆపరేట్ చేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. 2, 3 జర్మన్ హ్యాన్గర్స్ లో ఇంటర్నల్ పైప్ లైన్ వర్క్స్ , అందుకు సంబంధించిన వాల్వులు, రెగ్యులేటరులు, హుమిడి ఫైర్స్ లాంటి పరికరాలన్నీ మంగళవారం లోగా సిద్ధం కావాలన్నారు. తాత్కాలిక ఆస్పత్రిలో అవసరమైన డాక్టర్లను, స్టాఫ్ నర్స్ లను, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలను, ఇతర సిబ్బందిని నియమించాలని డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్ కు జిల్లా కలెక్టర్ సూచించారు. ఇప్పటికే కాల్ లెటర్లు అందించిన వారిని విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. వారందరికీ అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. ఆస్పత్రి వద్ద బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ టీమ్స్ ను పెట్టుకోవాలని, ఆసుపత్రికి అవసరమైన మందులను 100 శాతం పూర్తిగా సిద్ధంగా ఉంచాలని డ్రగ్స్ ఎడిని ఆదేశించారు. తాత్కాలిక ఆసుపత్రి వద్ద అవసరమైన అంబులెన్స్ లను ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్లు, నర్సులు కోసం డాక్టర్స్, నర్సింగ్ స్టేషన్లలో బెడ్ లు, ఛార్జింగ్ పాయింట్లు, అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే అన్ని సదుపాయాలు కల్పించామని లేదా అనేది పరిశీలన చేయాలన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కి అవసరమైన వసతి, భోజన సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించాలని ఆర్డీఓ గుణభూషన్ రెడ్డిని ఆదేశించారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని వారి వసతి ప్రదేశం నుండి ఆస్పత్రి వద్దకు వెళ్లేందుకు వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు.ఆస్పత్రి కి వచ్చే పాజిటివ్ వచ్చిన వారి బంధువుల కోసం కూడా భోజన ఏర్పాట్లు చేయాలన్నారు.
తాత్కాలిక ఆస్పత్రి చుట్టూ ఫెన్షింగ్ నాణ్యత గా చేపట్టాలి :
తాత్కాలిక ఆస్పత్రి చుట్టూ పెన్షింగ్ నాణ్యత గా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వెంటనే ఆస్పత్రిలో విద్యుత్ పని అంతా పూర్తి చేయాలని, అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి తాత్కాలిక ఆస్పత్రి కొరకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పైప్లైన్ రక్షణ కోసం ఫెన్షింగ్ ,దాని చుట్టూ లైటింగ్, మంగళవారం సాయంత్రం లోపు ఏర్పాటు చేయాలని ఆర్అండ్ బి ఎస్ఈని ఆదేశించారు. అలాగే తాత్కాలిక ఆస్పత్రి వద్ద బిటి రోడ్డు పూర్తిచేయాలన్నారు. లైటింగ్ కోసం విద్యుత్ సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పగలు రాత్రి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా సేఫ్టీ మరియు సెక్యూరిటీ ఉండాలన్నారు. అడిషనల్ స్టోరేజ్ వర్క్ను కూడా తొందరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. తాత్కాలిక ఆస్పత్రి వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని తాడిపత్రి మునిసిపల్ కమిషనర్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రి శుభ్రంగా, అందంగా ఉండాలని, ఆస్పత్రి చుట్టుపక్కల ప్రాంతం అంతా పార్క్ మాదిరిగా ఉండేలా చూడాలని, శానిటేషన్ పనులు బాగా చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తాత్కాలిక ఆస్పత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం నోడల్ అధికారులంతా బాధ్యతగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.