అన్ని వర్గాల ప్రజలకు మౌళిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం శంఖవరం మండల కేంద్రంలోని సిబ్బంది వీధిలో నిర్మించిన మినీ మంచినీటి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో ఎవరూ మంచినీటి కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంలో యుద్ధప్రాతిపదిక ఈ మంచినీటి పథకాన్ని పంచాయతీ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ మంచినీటి ట్యాంకు ద్వారా ఈ ప్రాంత వాసుల మంచినీటి కష్టాలు తీరిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పర్వత రాజబాబు, ఉప సర్పంచ్ కుమార్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.