ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు మనస్ఫూర్తిగా స్వీకరించి సమర్ధవంతంగా పని చేశానని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ చెప్పారు. బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ కు శాలువలు కప్పి పుష్పగుచ్ఛాలు, పుష్పమాలలతో జిల్లా అధికారులు మంగళవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో ఘనంగా సన్మానించారు. జిల్లా అభివృద్ధిలో మీ అందరి సహకారం ఎనలేనిదని జిల్లా కలెక్టర్ భాస్కర్ చెప్పారు. మీ ఆదరణ, అభిమానాలు మరువలేనవన్నారు. అందరూ కలిసి పనిచేయడానికి చక్కని అవకాశం లభించిందన్నారు. మీ శక్తిసామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, జ్ఞానమే మీ శక్తిగా భావించాలని, మీ నైపుణ్యాలతో దాన్ని సమయస్ఫూర్తితో వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. కష్టపడటం, ఎప్పుడు సిద్ధపడటం, నేర్చుకునే మనస్సు విజయాల వైపు నడిపిస్తుందని ఆయన వివరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సమర్థంగా ఎదుర్కొని ముందుకు అడుగులు వేయాలని స్పూర్తి దాయక ప్రసంగం చేశారు. జీవితంలో ఒడిదుడుకులు, ఉద్యోగంలో బదిలీలు సహజమేనన్నారు.
విజయాలు సాధించాలంటే ప్రధానమైన విలువలతో కూడిన పునాది వేసుకోవాలని ఆయన సూచించారు. అధికారులు మంచి ప్రవర్తనతో మెలగాలన్నారు. మన వ్యవహార శైలి, ఆధ్యాత్మికంగా మనస్సు స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మెలగాలన్నారు. ఏ సమస్యలు ఎదురైనప్పటికీ తక్షణమే వాటిని పరిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.
ప్రకాశంలో పరిపాలనా వ్యవస్థను ఏంతో బలోపేతం చేసిన మంచి పరిపాలనాధ్యక్షుడు పోల భాస్కర్ అని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రకాశంలో కమాండింగ్ కంట్రోల్ రూమ్, కంప్యూటర్ ట్రైనింగ్ ల్యాబ్ ల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపును సాధించి పెట్టారని ఆయన అభివర్ణించారు. క్లిష్టమైన పరిస్థితులలో సున్నితమైన సమస్యలు చాకచక్యంగా పరిష్కరించారని ఆయన వివరించారు. జిల్లాలో కలెక్టర్ గా రెండేళ్ల పాలనలో ఎంతో సన్నిహితంగా మెల్లిగా అని ఆయనను తండ్రి గా భావిస్తున్నాను చెప్పారు. గత ఏడాది కోవిడ్ లాక్ డౌన్ లో పారా పోలీస్ విభాగాన్ని స్థాపించి రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపు పొందారని ఆయన ప్రశంసించారు. ప్రజలకు మేలు చేయాలని బడుగులకు సహాయం చేయాలని ఆలోచనతోనే రెండేళ్ల పరిపాలన సాగించారని ఆయన విశ్లేషించారు
అభివృద్ధి పథంలో ప్రకాశం జిల్లాను నడిపిస్తూ తనదైన శైలిలో ఉత్తమ కలెక్టర్ గా పోల భాస్కర్ చెరగని ముద్ర వేసుకున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ తొలి స్వరంగం పనులు పూర్తి చేయడానికి ఏంతో కృషి చేశారని ఆయన తెలిపారు. ఆ ప్రాజెక్టు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలుపై ప్రత్యేక దృష్టి సారించారని ఆయన వివరించారు. రామాయపట్నం ఫోర్ట్, పరిశ్రమలకు భూసేకరణ, సోలార్ మెగా ప్రాజెక్టుకు భూసేకరణ, మార్కాపురం రాయవరంలో వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణలో అత్యంత కీలకపాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. జిల్లా యంత్రాంగాన్ని, రాజకీయ నాయకులను ఏకతాటిపైకి తెచ్చి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని అభివర్ణించారు. గొప్ప పరిపాలన అధ్యక్షుడిగా, అందరికీ మార్గదర్శిగా, స్నేహశీలిగా జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారని ఆయన వివరించారు. రైతు ప్రకాశం పేరుతో ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపకల్పన చేసి వ్యవసాయ రంగం అభివృద్ధికి బంగారు బాటలు వేశారని ఆయన వివరించారు. ఐఏఎస్ అధికారిగా రెండేళ్ల కాలం జిల్లాలో పరిపూర్ణంగా పని చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు సహజమేనని, ఆసమయంలో సహచర మిత్రులు, నాయకులతో అనుబంధం, ఆయన చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివన్నారు. ఆయన జిల్లాను వదిలి వెళ్లడం బాధాకరమైనదని జేసీ చెప్పారు.
క్షేత్ర పరిశీలన, నిబద్ధత, ప్రత్యేక దృష్టి సారించడంతోని జిల్లా అభివృద్ధిపథంలో వేగం పుంజుకుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి. ఎస్. చేతన్ తెలిపారు. జిల్లాలో మంచి పాలన అందించారని ఆయన వర్ణించారు.
లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సమర్ధంగా అందించడంలో కృతార్థులయ్యారని కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ తేజ చెప్పారు. పేదలకు గూడు కల్పించే బాధ్యత తీసుకోవడం, పరిపాలనలోను ఆదర్శంగా నిలిచారని ఆయన అభివర్ణించారు.
జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి అభివృద్ధిలో నడిపించిన ఘనత పోల భాస్కర్ కు దక్కుతుందని జేసి కృష్ణవేణి తెలిపారు. వెనుకబడిన జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధిలో తీసుకువెళ్లడానికి ఎంతో కృషి చేశారని ఆమె ప్రకటించారు.
అద్భుతమైన అవగాహన, ఆచరణ, ఆదర్శంగా జిల్లా కలెక్టర్ గా పోల భాస్కర్ అందరి మన్ననలు పొందారని జడ్పీ సీఈఓ కైలాస్ గిరీశ్వర్ చెప్పారు. దశ, దిశ ప్రకాశంగా జిల్లాను చక్కగా తీర్చిదిద్దారనిఆయన వివరించారు. చిత్తశుద్ధి, నిబద్ధతతో పని చేశారని ఆయన తెలిపారు.
మహిళా ప్రకాశం పేరుతో జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి మహిళల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారని ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో తిప్పే నాయక్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎస్.సరళవందనం, జడ్పీ సీఈవో కైలాస్ గిరీశ్వర్, సీపీవో డి.వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ పి రత్నావళి, డ్వామా పిడి సీనారెడ్డి, డిపివో జి.వి.నారాయణరెడ్డి, డిఈఓ ఎస్.సుబ్బారావు, పిఆర్ ఎస్ఈ కొండయ్య, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్ఈ మర్థన్అలీ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరాములు, డీటీసీ బి.కృష్ణవేణి, మహిళ, శిశు సంక్షేమ శాఖ పీడీ జి.లక్ష్మీదేవి, ఆర్డీవోలు ప్రభాకర్ రెడ్డి, ఎం.వి.శేషిరెడ్డి, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాములు, ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, వివిధశాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.