టీకా పంపిణీలో వారికి మినహాయింపులు..
Ens Balu
4
Sankhavaram
2021-06-03 14:29:22
ప్రజాప్రతినిధులకు కరోనా టీకా వేసే విషయంలో 45 సంవత్సరాల వయో పరిమితిలో ప్రభుత్వం మినహాయింపు నిచ్చిందని ఎంపీడీఓ జె.రాంబాబు వెల్లడించారు. గురువారం ఈ మేరకు శంఖవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వయస్సు అర్హత సడలింపు నిబంధన ప్రకారం 45 ఏళ్ళ వయస్సు తక్కువ ఉన్నప్పటికీ సర్పంచులు, వార్డు సభ్యులు కూడా కరోనా నివారణా టీకాలను వేసుకోడానికి అర్హులన్నారు. మండలంలోని శంఖవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల శాశ్వత కరోనా నివారణ టీకా కేంద్రానికి అదనంగా ఉప ప్రణాళిక ప్రాంత గిరిజన గ్రామాల ముఖ ద్వారమైన గౌరంపేటలోని ఉప ఆరోగ్య కేంద్రంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. శుక్రవారం నాటి ఈ టీకాల కార్యక్రమంలో 350 మందికి టీకాలు లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. వీటిలో గౌరంపేట కేంద్రంలో 200 మందికి, శంఖవరం కేంద్రంలో 150 మందికీ టీకాలు వేస్తామని ఆయన వెల్లడించారు. నూరు శాతం టీకాలు పూర్తయ్యి, కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఎంపీడీఓ. జె.రాంబాబు కోరారు.