విజయనగరం జూట్ మిల్లు యాజమన్య ప్రతినిధులను రప్పించి నెల్లిమర్ల జూట్ మిల్లు సమస్యపై జాయింట్ కలెక్టర్(ఆసరా) ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి పరిష్కారానికి ప్రయత్నం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ను ఆదేశించారు. జూట్ మిల్లు సమస్య పరిష్కారం విషయమై మంత్రి బొత్స సత్యనారాయణకు జూట్ మిల్లు కార్మిక సంఘం నాయకులు పి.అప్పారావు తదితరులు మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా.కిషోర్ కుమార్, కార్మికశాఖ ఉప కమిషనర్ పురుషోత్తంలను అడిగి సమస్య వివరాలను మంత్రి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావులతో కలసి జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయిలో చర్చలు జరిపి సమస్య పరిష్కారం జరిగేలా ప్రయత్నం చేయాలని సూచించారు. ఇక్కడ పరిష్కారం సాధ్యం కాని పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో ప్రయత్నం చేస్తామన్నారు.
జిల్లాలో నిర్మాణాలకు ఇసుక సరఫరా సులభతరం చేసే పద్ధతులను అన్వేషించాలని మంత్రి బొత్స జాయింట్ కలెక్టర్ డా.కిషోర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం ఇసుక సరఫరా అవుతున్న విధానంకంటే మరింత మెరుగైన, సులభ రీతిలో ఇసుక పొందేలా విధానాలు రూపొందించే విధానాలకు రూపకల్పన చేయాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని, ఒకటి లేదా రెండు రోజుల్లో తయారు చేస్తామన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్‌లు డా.ఆర్.మహేష్ కుమార్, జె.వెంకటరావు, ఆర్.డి.ఓ. భవానీశంకర్, డి.సి.ఎల్.పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.