కరోనా సనయంలో దాతలు ముందుకు రావడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలుపడుతుందని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాని పేర్కొన్నారు. శుక్రవారం అత్యవసర వైద్యసేవలకు ఉపయోగించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉప ముఖ్యమంత్రి వైద్యాధికారులకు పంపిణీ చేసారు. జియ్యమ్మవలస మండలం చిన్నమేరంగిలోని తన క్యాంపు కార్యాలయంలో వాటిని వైద్యులకు అందించారు. చిన్నమేరంగి, కురుపాం, భద్రగిరి, సాలూరు సామాజిక వైద్య కేంద్రాలకు, పార్వతీపురం ఏరియా ఆస్పత్రుల్లో వినియోగానికై వీటిని ఉప ముఖ్యమంత్రి అందజేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచనమేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని సహకారంతో ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం 30 కాన్సన్ట్రేటర్లను కురుపాం నియోజకవర్గంలోని వైద్యశాలల కోసం అందించినట్లు ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి తెలిపారు. వీటిలో 15 కాన్సన్ట్రేటర్లను కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, భద్రగిరి, చిన్నమేరంగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఇస్తూ మిగిలిన వాటిలో సాలూరు సీ.హెచ్.సీకి 5, పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి 10 చొప్పున కాన్సన్ట్రేటర్లను అందించామన్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించడానికి సహకరించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి, ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కు ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. వాగ్దేవి, డిప్యుటీ డిఎంహెచ్ఓ రవికుమార్ రెడ్డి, డా.కమల కుమారి(చిన్నమేరంగి), డా.ఉదయ్ కుమార్(భద్రగిరి), డా.గౌరీశంకర్ (కురుపాం) తదితరులు పాల్గొన్నారు.